వారాహి మాత పూజ ఎలా చేయాలి?.. తెలుసుకోవాల్సిన ముఖ్య నియమాలు

bharatiyasampradayalu

వారాహి మాత పూజను భక్తి, నియమంతో ఆచరిస్తే మంచి ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. ఈ పూజ ప్రారంభించేటప్పుడు అమ్మవారి ఫోటో లేదా విగ్రహం ఉంటే వాటిని ప్రతిష్ఠించి పూజ చేయవచ్చు. అవి అందుబాటులో లేకపోతే కలశాన్ని ఏర్పాటు చేసి వారాహి మాతను ఆవాహన చేసుకోవచ్చు. అది కూడా సాధ్యం కాకపోతే ఇంట్లో నిత్యం వెలిగించే దీపాన్నే అమ్మవారి రూపంగా భావించి పూజ ప్రారంభించవచ్చు.

భక్తి ప్రధానమని, విగ్రహం లేదా ఫోటో తప్పనిసరి కాదని పండితులు పేర్కొంటున్నారు. దీపజ్యోతిని వారాహి మాత స్వరూపంగా భావించి వరుసగా 16 శుక్రవారాలు పూజ చేయడం శ్రేయస్కరంగా భావిస్తారు.

అలాగే ప్రతి నెలలో వచ్చే రెండు పంచమి తిథుల్లో ప్రత్యేకంగా వారాహి మాత పూజ నిర్వహించాలని సూచిస్తున్నారు. ఈ సందర్భంగా గుండ్రంగా చేసిన ఐదు లడ్డూలను నైవేద్యంగా సమర్పించి దీపారాధన చేయడం మంచిదని చెబుతున్నారు.

వారాహి దేవిని “రాత్రి దేవత”గా భావిస్తారు. అందువల్ల ఈ పూజను సాధ్యమైనంత వరకు సాయంత్రం 6 గంటల తర్వాత ప్రారంభించడం ఉత్తమమని శాస్త్రోక్తంగా పేర్కొంటారు. భక్తులు తమ ఓపిక ఉన్నంతవరకు అమ్మవారిని ధ్యానిస్తూ పూజ కొనసాగించవచ్చు.

ఇంట్లో మహిళలకు నెలసరి సమయంలో ఉంటే, కుటుంబ సభ్యులైన భర్త లేదా పిల్లల చేత దీపారాధన చేయించి పంచమి తిథి పూజను కొనసాగించవచ్చని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు.

శాస్త్రాల ప్రకారం వారాహి మాతకు పగటి పూజకంటే సాయంకాల పూజకు అధిక ప్రాధాన్యం ఉందని, ఆ సమయంలో చేసిన ఆరాధన వల్ల మంచి ఫలితాలు పొందవచ్చని విశ్వసిస్తారు.

Share This Article