Mangueshi Temple: సాక్షాత్తు పరమేశ్వరుడు ప్రతిష్టితమైన గోవాలోని ‘మంగేషీ’ మందిరం

bharatiyasampradayalu

గోవా కేవలం ప్రకృతి అందాలకే పరిమితం కాకుండా, ఆధ్యాత్మికంగా కూడా ఎంతో విశిష్టత కలిగిన ప్రదేశం. ఈ చిన్న రాష్ట్రంలో అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా, ఆది శంకరుల గురువు గోవిందపాదులకు గురువైన గౌడపాదాచార్యుల ఆశ్రమం ఇక్కడ ఉంది. సనాతన ధర్మానికి పునాది అయిన ఈ పవిత్ర భూమిలో, శివుని ప్రతిష్ఠిత స్థానం శ్రీ మంగేశి మందిరం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

శ్రీమంగేశి ఆలయ స్థాన మహిమ

స్థలపురాణం ప్రకారం, ఒకసారి కైలాసంలో పార్వతీ దేవితో ఆటలాడుతూ శివుడు ఓడిపోవడంతో ఈ ప్రాంతానికి వచ్చి నివాసం ఏర్పరచుకున్నారు. శివుడిని వెతుకుతూ పార్వతీ అమ్మవారు ఇక్కడకు వచ్చినప్పుడు, శివుడు పులి రూపంలో ఆమె ముందు ప్రత్యక్షమయ్యారు. హఠాత్తుగా ఈ దృశ్యాన్ని చూసిన పార్వతీ కాసేపు నిశ్చేష్టురాలయ్యారు. అనంతరం తేరుకొని “త్రాహి మాం గిరీశ” అంటూ ప్రార్థించగా, శివుడు తన మానవ రూపంలోకి మారి ఆమెకు దర్శనమిచ్చారు. ఈ సంఘటనలో “మాం గిరీశ” అన్న పదం కాలక్రమంలో “మంగేశ్”గా మారింది.

జువారి నది ఒడ్డున శివుడు ప్రత్యక్షమైన ఈ స్థలంలోనే ఆలయాన్ని నిర్మించారు. ఆ తరువాత, పోర్చుగీసువారు ఈ ప్రాంతాన్ని ఆక్రమించి ఆలయాన్ని ధ్వంసం చేశారు. భక్తులు శివలింగాన్ని సమీపంలోని ప్రియల్‌ గ్రామానికి తరలించి నాలుగు శతాబ్దాల పాటు పూజలు నిర్వహించారు. 18వ శతాబ్దంలో మరాఠా సైన్యాధికారి రామచంద్ర సుక్తాంకర్‌ ఆలయాన్ని పునర్నిర్మించి, శివలింగాన్ని ప్రతిష్టించారు. ఆలయంలో ఎత్తైన దీపస్తంభం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఇతర ఆలయాలు

ప్రధాన దేవాలయం చుట్టూ అనేక ఉపాలయాలు ఉన్నాయి. వీటిలో వినాయక, భైరవ, ముక్తేశ్వర్‌, గ్రామదేవత శాంతేరి, దేవి భగవతి ఆలయాలు ముఖ్యమైనవి. ఈ దేవాలయాలు కూడా భక్తులను ఆకర్షిస్తున్నాయి.

గమ్యస్థానం చేరుకోవడం ఎలా?

గోవా రాజధాని పనాజీకి 22 కిలోమీటర్ల దూరంలో శ్రీమంగేశి ఆలయం ఉంది. దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి గోవాకు రోడ్డు, రైలు, మరియు విమాన మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు.

Share This Article