ద్వైత అద్వైత విశిష్టాద్వైతములు మూడును వేద సమ్మతములైన మతములు. వీటినే మతత్రయమంటారు. ద్వైత మత స్థాపనాచార్యులు మధ్వాచార్యులు కన్నడిగలు (1199-1303). అద్వైతమత స్థాపనా చార్యులు శంకరాచార్యులు (684-716) కేరళీయులు, విశిష్టాద్వైత మతస్థాపనాచార్యులు భగవద్రామానుజాచార్యులు (1017-1137) ఆంధ్రులు. ఆత్మయే పరమాత్మయని అద్వైతమత వాదము. “బ్రహ్మ సత్యం, జగన్మిథ్యా, జీవో బ్రహ్మైవ నాపరః” బ్రహ్మమొక్కటే సత్యము, జగత్తు సర్వము మిథ్య, జీవుడు బ్రహ్మమే. బ్రహ్మము కంటె వేరుకాదు అని దీని తాత్పర్యము. విశేషణ యుక్తమైన అద్వైతము విశిష్టాద్వైతము. పరబ్రహ్మము విశేషణయుక్తము. అనగా గుణములు కలదనీ, శ్రీమన్నారాయణుడొక్కడే ఆ పరబ్రహ్మమనీ విశిష్టాద్వైతుల వాదము. ఆత్మ (జీవాత్మ) వేరు, పరమాత్మ వేరనీ, శ్రీమహావిష్ణువే పరమాత్మయనీ ప్రతిపాదించునది ద్వైతము. ఈ మూడు మతములవారికి వేదములు, ఉపనిషత్తులు, పురాణములు ఆధారము.
పైన పేర్కొన్న మూడు మతాలలో విశిష్టాద్వైతమత ప్రతిష్ఠాపనా చార్యులు భగవద్రామానుజాచార్యులు. చెన్నపట్నానికి సమీపానగల శ్రీ పెరుంబుదూరులో (భూతపురి) ఆసూరి యింటి పేరుగల కేశవస్వామియనే ఆంధ్రవైష్ణవ బ్రాహ్మణులుండేవారు. అనేక యజ్ఞయాగాదులు నిష్ఠతో చేసినారు కనుక ఆయనను కేశవయజ్వ అనేవారు. తిరుపతి తిరుమలలో మానవసేవ, మాధవసేవలను కఠోర నియమంతో చేస్తుండిన తిరుమల నంబికి (శ్రీశైలపూర్ణులకు) ఇరువురు చెల్లెండ్రు; పెద్ద చెల్లెలు కాంతిమతిని కేశవయజ్వకు, చిన్నచెల్లెలు శ్రీదేవిని మలవైమంగలం కమలనయన భట్టరుకు ఇచ్చి పెండ్లి చేసినారు. కేశవయజ్వ కాంతిమతి ఒకరికోసం మరొకరు జన్మించినవారు. వారికి దీర్ఘకాలందాక సంతానం కలుగకపోతే వారు ఒక చంద్ర గ్రహణంనాడు చెన్నపట్నం సముద్రస్నానం చేసి తిరువళ్ళిక్కేణి పార్థసారథి ఆలయంలో పుత్రకామేష్టి స్వామి నారాధించినారు.
పార్థసారథి ప్రీతుడై “నేనే మీకు పుత్రుడనై పుడుతా”నని వరమిచ్చినాడు. అన్నట్లే కాంతిమతి గర్భం ధరించినది. క్రీ.శ. 1017 సం॥ చైత్ర శుద్ధ పంచమీ గురువారం ఆర్దానక్షత్ర కర్కాటకలగ్నంలో ఒక దివ్యబాలుడు పుట్టినాడు. ఈ వార్త విన్న తిరుమల నంబి తిరుపతి నుండి వచ్చి మేనల్లుని చుట్టు వెలుగుతున్న కాంతిమండలం చూచి శ్రీరామచంద్రుని ప్రియతమ సోదరుడైన లక్ష్మణుని విశిష్టలక్షణాలు గుర్తించి రామానుజులని నామకరణం చేసినారు. అనతికాలంలోనే కాంతిమతి చెల్లెలు శ్రీదేవి ప్రసవించి కొడుకును కంటే గోవిందుడని నామకరణం చేసినారు. శ్రీ పెరుంబుదూరులోని వైష్ణవులందరూ వచ్చి ఆ దివ్యబాలుని అందం, తేజస్సు చూచి ఆశ్చర్యానందాలు పొంది దీవించిపోయినారు.
ఆ వచ్చిన వారిలో తిరుక్కచ్చినంబి అనే వైశ్యుడు సంప్రదాయ పరిరక్షకుడు ఒకరు. రామానుజులకు ఐదవయేట అక్షరాభ్యాసము, గర్భాష్టమున ఉపనయనము చేసి కేశవాచార్యులే తమకు వచ్చిన సమస్తవిద్యలు నేర్పి 16వ యేట తంజమ్మతో పెండ్లి చేసినారు. కొడుకు కోడలు ముద్దుముచ్చటలు చూడకుండానే కేశవయజ్వ పరమపదించినారు. కొంత కాలము తల్లివద్దనేయుండి ఆమె నూరడించి రామానుజులు వేదాంత మభ్యసించుటకై పిన్నమ్మకొడుకు గోవిందుని తోడుకొని కాంచీపురమున నున్న నాటి గొప్ప వేదాంత పండితుడు యాదవ ప్రకాశులను ఆశ్రయించినాడు. యాదవ ప్రకాశుడు గొప్ప పండితుడే కాని ఋజువర్తనుడు కాడు, మీదు మిక్కిలి విష్ణుద్వేషి. ఐనా రామానుజులు గోవిందుడు యాదవప్రకాశులను సేవిస్తూ వేదాంత విద్య నభ్యసిస్తుండినారు.
ఒకనాడు యాదవప్రకాశులు ‘సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ’ అనే తైత్తిరీయోపనిషత్తులోని వాక్యాన్ని వ్యాఖ్యానిస్తూ శ్రుతితాత్పర్యం పరమా ద్వైతమని వివరిస్తే, రామానుజులు వ్యతిరేకిస్తూ అవి బ్రహ్మమునకు విశేషణములు మాత్రమే అని నిరూపించినారు. యాదవప్రకాశులు కుపితులై రామానుజులను వెళ్ళిపొమ్మన్నారు. రామానుజులు గురువులతో వాదించ కూడదని నిశ్చయించుకొని విద్యాభ్యాసం కొనసాగించినారు. ఇంకొకనాడు రామానుజులు గురువులకు తలంటుతుండగా ఆయన “తస్య యథా కప్యాసం పుండరీక మేవ మక్షిణీ” అనే ఛాందోగ్యోపనిషద్వాక్యాన్ని వ్యాఖ్యానిస్తూ బ్రహ్మము (శ్రీమన్నారాయణుని) కన్నులు కోతిపృష్ఠంవలె ఎఱ్ఱగా ఉంటాయని వివరిస్తే రామానుజులు దుఃఖితులై కప్యాసమంటే సూర్యునిచే ఉన్మీలిత మని అర్థం చెప్పి ఆ వాక్యానికి భగవంతుని నేత్రాలు సూర్య వికసిత పద్మాల వంటివని ప్రత్యాఖ్యానించినారు.
యాదవప్రకాశులు కోపం పట్టలేక రామానుజులను వెళ్ళి పొమ్మన్నారు. రామానుజులట్లే మునుముందు ఇంకా బలీయుడైతే అద్వైతానికి ప్రబల విరోధి ఔతాడనీ కనుక రామానుజులను ఎట్లాగైనా కడతేర్చవలెనని నిశ్చయించుకున్నాడు. ఇట్లుండగా కాంచీపురం రాజకుమారిని బ్రహ్మరాక్షసుడావేశిస్తే యాదవ ప్రకాశులు విడిపించలేక పోయినాడు. కాని రామానుజులు గ్రహమును పారద్రోలితే రాజుగారు గురుశిష్యులను ఇరువురినీ సత్కరించినారు. ఇది కూడ యాదవ ప్రకాశులకు రామానుజులపై ఈర్ష్య పెరగటానికి మరొక కారణమైనది. యాదవప్రకాశులు తమకు నమ్మకమైన శిష్యులతో సంప్రదించి కాశీయాత్రమిషతో రామానుజులను తమ వెంట తీసుకుపోయి మార్గ మధ్యంలో ఎక్కడో ఒక అడవిలో చంప నిశ్చయించుకున్నారు.
రామానుజుల పినతల్లి కుమారుడైన గోవిందుడీ విషయం పసికట్టి తానుగూడ కాశీయాత్రకు బయలుదేరినాడు. అదనుచూచి రామానుజులను హెచ్చరించవచ్చుననుకున్నాడు. వింధ్యపర్వత ప్రాంతాలు చేరిన తరువాత గోవిందుడు అన్నగారికీ విషయం చెప్పి,హెచ్చరించినాడు. రామానుజులా బృందంనుండి వెనుకబడినట్లు నటించి కాంచీపురం బాటపట్టినారు. తనను అనుమానించకుండా గోవిందుడు మాత్రం గురువులవెంట కాశీయాత్రకు పోయినాడు. యాదవప్రకాశులు రామానుజుల కోసం వెదకించి ఏదో క్రూరమృగం వాతబడియుంటాడని సంబరపడ్డారు.
భగవంతునిపై భారంవేసి రామానుజులు ధైర్యంతో దుర్గ మారణ్యాలు దాటుతూ రాత్రులు అనువైనచోట్ల విశ్రమిస్తూ ఒక రేయి అలసిపోయి భగవంతుని స్మరిస్తూ, నిద్రపోయి లేచేవరకు, ఎదుట వ్యాధదంపతులు కనబడ్డారు. వారు రామానుజులను విచారించి విషయములు తెలిసికొని తాము రామేశ్వరానికి పోతున్నట్లు చెప్పి తమవెంట తోడుకపోయినారు. ఒక మధ్యరాత్రి వ్యాధుని భార్యకు దాహం వేస్తే రామానుజులు సమీపానగల బావినుండి నీరు తెచ్చి యిచ్చినారు. దంపతులు సంతోషించి నిద్ర పోయినారు. తెల్లవారి రామానుజులు మేల్కొని చూస్తే కిరాత దంపతులు లేరు. రామానుజులు అటుయిటు చూస్తే తాము కంచి బయట ఉన్నట్లు తెలుసుకొని కంచివరదుడు సతీసమేతంగా వచ్చి తనను క్షేమంగా కంచికి చేర్చినాడని పరమానందం పొందినారు.
రామానుజులు ఇల్లుచేరి తల్లి కాంతిమతికీ విషయాలన్నీ చెప్పినారు. ఐనా ఈ విషయాలన్నీ రహస్యంగానే ఉంచినారు. ఎప్పటట్లు రామానుజులు కొంతకాలం యాదవప్రకాశులను శుశ్రూషించినారు. తల్లిగారి ఆదేశం ప్రకారం రామానుజులు కాంచీ పూర్ణులనే శూద్రవైష్ణవయోగి నాశ్రయించగా ఆయన “వ్యాధరూపంలో వచ్చినది కంచివరదుడే, కనుక నీవు ఇప్పటినుండి కంచి బయటనున్న ఆ బావినుండి నీరు తెచ్చి కంచివరదుని తిరుమంజనకైంకర్యం చేయు” మన్నారు. ఆళవందారు తరువాత రామానుజుల నాయకత్వంలో వైష్ణవమత భవిష్యత్తు సురక్షితంగా ఉండగలదని కాంచీ పూర్ణులు విశ్వసించినారు.
-END Part 1/ సశేషం –