Bhagavad Ramanujacharya: భగవద్రామానుజులు-“సమభావనకు బాట వేసిన మహనీయుడు” (1017-1137) Part-2

bharatiyasampradayalu
Bhagavad Ramanujacharya

ఆ కాలంలో శ్రీరంగంలో యామునాచార్యులు (ఆళవందారులు), శ్రీ వైష్ణవ కులపతులు. వారు విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారకుల్లో శ్రేష్ఠులు. మహాపూర్ణులు (పెరియనంబి), శ్రీశైలపూర్ణులు (తిరుమల నంబి), కాంచీపూర్ణులు (తిరుక్కచ్చినంబి) వంటి ప్రముఖులందరూ వారివద్దనే విశిష్టాద్వైత సిద్ధాంతగ్రంథములను విష్ణుభక్తితత్త్వమును అభ్యసించినారు. ఆళవందారులు రామానుజుల గూర్చి విని ఒకసారి కంచికి వచ్చినపుడు దూరంనుండి చూచి మునుముందాయనే వైష్ణవజ్యోతిని ప్రజ్వలింప జేసే సమర్థు డౌతాడని నిశ్చయించినారు.

తిరుక్కచ్చినంబికి రామానుజులు శిష్యులైన వార్త విని రామానుజులను తోడితేర పెరియనంబిని పంపినారు. అప్పటికే ఆళవందారులు కడువృద్ధులు, జీవితచరమాంకంలో ఉన్నారు. పెరియనంబి నీర కైంకర్యం చేస్తున్న రామానుజులను దూరంనుండి చూచి వారి ఆకార వైభవానికి ముగ్ధులై ఆళవందారులు స్తోత్రరత్నం బిగ్గరగా గానం చేసినారు. రామానుజులా గానం విని ఆకృష్టులై విచారిస్తే తమ గురువులు, కాంచీపూర్ణులకు గురువుల రచనమని మహానందం అనుభవించినారు. ఆళవందారులు మృత్యుముఖంలో ఉన్నారని, వారి ఆదేశం ప్రకారం తమను వారి సన్నిధికి తీసుకుపోవటానికి వచ్చి నామనీ చెప్పగనే రామానుజులు హుటుహుటిగా పెరియనంబి వెంట బయలుదేరారు.

వారు శ్రీరంగం ప్రవేశిస్తుండగా ఆళవందారులు పరమపదించినారనీ వారికి అంతిమ సంస్కారం చేయటానికి శ్రీవైష్ణవులందరూ అక్కడికి చేరినట్లు తెలిసి దుఃఖించినారు. ఆళవందారుల కళేబరం చూస్తుంటే కుడిచేయి మూడు వ్రేళ్ళు ముడిచియున్నట్లు గమనించిన రామానుజులు ధ్యానంలో శ్రీవారికి మూడు కోరికలుండేవని గ్రహించినారు.

ఆ మూడు 1) వ్యాస పరాశరులకు శాశ్వతస్మృతి చిహ్నం ఏర్పాటు చేయటం, 2) తమిళ మహాకవులలో అగ్రేసరులైన నమ్మాళ్వారులకు ప్రేమ గౌరవాలు సమర్పించటం, 3) బ్రహ్మసూత్రాలకు విశిష్టాద్వైతపరంగా వ్యాఖ్యానం వ్రాయటమని తెలిసి వాటిని తాము తీర్చుతామని శపథం చేసినారు. ఆళవందారుల అంత్యక్రియల తరువాత రామానుజులు శ్రీరంగం లోనికి పోకుండా కంచికి తిరిగివచ్చి తాము చేసిన ప్రతిజ్ఞల సాధనకై నిరంతరాధ్యయనశీలురై యుంటూ తత్త్వచింతన చేస్తుండేవారు. ఇంతలో వారి తల్లి కాంతిమతిగారు పరమపదించినది.

తల్లికి పరలోక క్రియలు చేసి రామానుజులు కంచిలోనే కాంచీపూర్ణులను సేవిస్తూ తత్త్వచింతన చేస్తుండినారు. రామానుజుల భార్య తంజమ్మ తిరుక్కచ్చినంబి బ్రాహ్మణేతరులనే చిన్నచూపుతో వారియెడ వరుసగా మూడుసార్లు తప్పు చేసినది. రామానుజులెంత చెప్పినా, హెచ్చరించినా వినలేదు. రామానుజులు ఆమెను ఏదో సాకుతో పుట్టినింటికి పంపారు.

రామానుజులు సత్యం తెలుసుకోవటానికి తిరుక్కచ్చినంబిని ఆశ్రయిస్తే ఆ మహానుభావుడు వరదరాజ పెరుమాళ్ళ ఆదేశంగా

శ్లో॥ అహమేవ పరబ్రహ్మ జగత్కారణకారణః
క్షేత్రక్షేత్రజ్ఞయోర్భేదస్సిద్ధ ఏవ మహామతే,
మోక్షోపాయో న్యాస ఏవ జనానాం ముక్తిమిచ్ఛతాం
మద్భక్తానాం జనానాం చ నాంతిమస్మృతిరిష్యతే
పూర్ణాచార్యం మహాత్మానం సమాశ్రయ గుణాశ్రయమ్.

అనే శ్లోకాన్ని పఠించి వివరించి అర్థషట్కప్రాప్తిని కలిగించినారు. శ్రీరామానుజులు శ్రీరంగంలో పెరియనంబినుండి నేర్వవలసిన దెంతో ఉన్నది కనుక శ్రీరంగం పయనమైనారు. అదే సమయంలో శ్రీరంగం వైష్ణవమండలివారు రామానుజులవారిని తోడ్కొని రావలసిందిగా పెరియనంబినే కాంచీపురం పంపినారు. పెరియనంబి భార్యాసహితులై కంచికి బయలుదేరి త్రోవలో మధురాంతకంలో ఆగి కోదండరామ స్వామిని సేవించారు.

ఆడబోయిన తీర్థమెదు రైనట్లు త్రిపురాంతకంలో రామానుజులు పెరియనంబిని కలుసు కున్నారు. పెరియనంబి పాంచరాత్రాగమప్రోక్త దీక్షాప్రదానవిధి ననుసరించి రామానుజులకు పంచసంస్కారములు నిర్వర్తించి అష్టాక్షరీమంత్ర మిచ్చి ఆళవందారుల పరమానుగ్రహాన్ని అందించినారు. అక్కడే తత్త్వత్రయాన్ని (ప్రమాణ, ప్రమేయ, ప్రమాతలు) వివరించినారు. రామానుజుల వెంట కంచికిపోయి అక్కడ ఆరు నెలలుండి ద్రావిడవేదం 4000 మంత్రాలలో 3000 మంత్రాలు, వ్యాసకృత బ్రహ్మసూత్రాలు రామానుజుల కుపదేశించినారు. రామానుజులు భార్యను త్యజించి, యామునాచార్యుల పాదాలు ధ్యానిస్తూ కంచిలో వరదరాజ స్వామివారినుండియే సన్న్యాసాశ్రమం స్వీకరించి కాషాయములు త్రిదండము కమండలము ధరించారు.

వరదరాజస్వామి ఆదేశంతో కాంచీపూర్ణులు సమస్తగౌరవ లాంఛనాలతో రామానుజులకు స్వామిసన్నిధిలో అర్చక ముఖంగా యతిరాజులనే ప్రశస్తి కల్పించి ఆ మందిరంలోనే ఒక భాగంలో వారికి మఠం ఏర్పాటు చేసినారు. అంత చిన్న వయస్సులో, అందమైన ఆకారంతో దివ్యరోచులు చిమ్మే యతిరాజులను పలుప్రదేశాల వైష్ణవులు, భక్తులు, సామాన్యులు వచ్చి దర్శించి పోయేవారు. యతిరాజుల కీర్తి దేశమంతట ప్రాకింది.

ముందుగా యతిరాజుల మేనల్లుడు పురుష మంగళాగ్రహార వాసి దాశరథి, కూర గ్రామవాసి కూరేశులు రామానుజులకు శిష్యులై వారిచెంత సమస్తవిద్యలు నేర్చినారు. ఈ యిరువురు యతిరాజులకు కుడి యెడమ భుజముల వంటివారు. అటు తరువాత తమను చంప యత్నించిన అద్వైతా చార్యులు, పూర్వగురువులు, యాదవప్రకాశులు మనశ్శాంతిని కోలుపోయి తల్లిగారి ఆదేశం, తిరుక్కచ్చి నంబి ఆదేశం ప్రకారం రామానుజులను ఆశ్రయించి శిష్యులైయ్యారు.

అప్పటినుండి అద్వైతుల యిండ్లలో కూడ యతిరాజుల ప్రశస్తి ప్రాకి ఎందరో వచ్చి దర్శించి పోయేవారు. యతిరాజుల పిన్నమ్మ శ్రీదేవి కొడుకు శైవుడుగా మారి శ్రీకాళహస్తిలో ఉంటున్న గోవిందుడు వచ్చి రామానుజుల శిష్యు డైనాడు. ఈ నలుగురు అటు తరువాత శ్రీవైష్ణవ మతమునకు సంబంధించిన అనేక రచనలు చేశారు.

Share This Article