Suvarchala-Anjaneya: శ్రీ ఆంజనేయస్వామి,సువర్చలా దేవి కళ్యాణం

bharatiyasampradayalu
The Story of Marriage of Lord Hanuman and Mata Suvarchala

ఆంజనేయ స్వామి జన్మతః బ్రహ్మచారి, ఆయన పుట్టినప్పుడే యజ్ఞోపవీతము ధరించినవారు. ఘోటక బ్రహ్మచారి అయినా, లోకహితార్థం వివాహం చేసుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆయన బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టలేదు. పరాశర సంహితలో ఈ విషయాన్ని విశేషంగా ప్రస్తావించారు.

ఒక సందర్భంలో, సూర్యదేవుడు విశ్వకర్మ కుమార్తె సంజ్ఞాదేవిని వివాహం చేసుకున్నారు. కానీ, సూర్యుని తీవ్రమైన తాపాన్ని తట్టుకోలేక సంజ్ఞాదేవి అసహనానికి లోనయ్యారు. తన కష్టాన్ని తల్లికి తెలియజేశారు. తల్లి, తమ కుమార్తె బాధను గ్రహించి, విశ్వకర్మతో మాట్లాడారు.

విశ్వకర్మ, సూర్యుని కాంతిని కొంత తగ్గించగా, ఆ వెలుతురు ఒక అపురూప సుందరి రూపాన్ని దాల్చింది. ఆమె అందచందాలను చూసిన దేవతలు ఆశ్చర్యచకితులయ్యారు. ఈ రహస్యాన్ని తెలుసుకోవాలని ఇంద్రుడు, బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి ఆ కన్య ఎవరని ప్రశ్నించాడు.

ఇంద్రుని ఉద్దేశ్యాన్ని గ్రహించిన బ్రహ్మదేవుడు, ఆమెకు సరైన వరుడు శివాంశసంభూతుడైన హనుమంతుడే అని తెలిపారు.

బాల హనుమంతుడు తల్లి అంజనాదేవి ప్రేమలో పెరిగి, అనంతరం ఆమె అనుమతితో సూర్యదేవుని వద్ద విద్యలు అభ్యసించాడు. శిక్షణ పూర్తయిన తరువాత, గురువును నమస్కరిస్తూ, “గురుదేవా, మీకు గురుదక్షిణగా ఏమి సమర్పించగలను?” అని ప్రశ్నించాడు.

సూర్యదేవుడు ఆనందంగా, “ఆంజనేయా! నువ్వు శివాంశసంభూతుడవు. విశ్వకర్మ నాలోని ప్రకాశాన్ని వేరుచేసినపుడు, అది నా కూతురుగా జన్మించింది. నా కాంతినుంచి ఉద్భవించిన సువర్చలా దేవిని నీతో వివాహం చేయాలనుకుంటున్నాను. ఇదే నా కోరిక, నీవు నాకు ఇచ్చే గురుదక్షిణ!” అని అన్నారు.

అయితే హనుమంతుడు, “దేవా! నేను బ్రహ్మచర్యాన్ని పాటించాలనుకున్నాను. నా జీవిత లక్ష్యం అదే. నేను ఈ వివాహాన్ని ఎలా స్వీకరించగలను?” అని ప్రశ్నించాడు.

దీనికి సూర్యదేవుడు సమాధానమిస్తూ, “సువర్చలా దేవి దివ్యాంశసంభూతురాలు. నిన్ను బ్రహ్మచర్యం నుంచి మరలించాలనే ఉద్దేశ్యం నాకు లేదు. నీవు వివాహం చేసుకున్నా, ప్రాజాపత్య బ్రహ్మచారిగానే మిగిలిపోతావు. ఇది జగత్తు మంగళార్థమే. నీవు భవిష్యత్తులో బ్రహ్మదేవునిగా అధిష్ఠానము చేస్తావు. అప్పుడు, సువర్చలా దేవి వాణిదేవిగా స్థానం పొందుతారు” అని వివరించారు.

ఈ మాటలు విన్న హనుమంతుడు సందేహం వీడి, సూర్యుని ఆదేశానుసారం, సువర్చలా దేవిని వివాహమాడారు. ఈ వివాహం జేష్ఠ శుద్ధ దశమి నాడు సూర్యదేవుని సాక్షిగా ఘనంగా జరిగింది.

Share This Article