నవరాత్రి ఉత్సవాలు మన భారతీయ సాంస్కృతిక వారసత్వంలో అత్యంత గొప్పవిగా భావించబడతాయి. తొమ్మిది రోజులపాటు అమ్మవారిని వివిధ రూపాలలో ఆరాధించి,పదవ రోజున విజయదశమి జరుపుకుంటారు. ఈ ఉత్సవాల వెనుక ఉన్న ప్రధాన గాథే మహిషాసుర మర్దిని కథ. ఈ కథలో ఉన్న నీతి ఏమిటంటే, ఎంతటి దుష్టశక్తులు పెరిగినా, అవి చివరికి ధర్మం ముందు ఓడిపోవలసిందే.
మహిషాసురుడు అనే రాక్షసుడు, శివుడికి కఠిన తపస్సు చేసి, “స్త్రీ తప్ప మరెవ్వరూ నన్ను చంపలేరు” అనే వరం పొందాడు. అతడు స్త్రీలను బలహీనులుగా భావించి ఆ వరం తీసుకున్నాడు. కానీ ఆ వరమే అతని మరణికి కారణమైంది. ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే , శక్తి అనేది ఎల్లప్పుడూ స్త్రీలోనే ఉందని, విశ్వాన్ని నడిపించే మూలకారణం అదే అని నమ్ముతారు.
మహిషాసురుని అహంకారం, దేవతల ప్రార్థన..
మహిషాసురుడు వరం పొందిన తర్వాత అహంకారంతో రెచ్చిపోయాడు. ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, వాయువు, యముడు వంటి దేవతలందరినీ ఓడించి, స్వర్గాసనాన్ని ఆక్రమించాడు. భూమిపై ప్రజలు రాక్షసుల దౌర్జన్యంతో బాధపడుతూ ఉండేవారు. ఆ సమయంలో దేవతలు అందరూ కలిసి బ్రహ్మ, విష్ణు, శివుని వద్దకు వెళ్లి “మహిషాసురుడి దుష్టకార్యాలను ఆపే శక్తి మాలో ఎవరికీ లేదు. స్త్రీ శక్తి మాత్రమే అతనిని సంహరించగలదు. దయచేసి మాకు రక్షణ ప్రసాదించండి” అని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ శక్తిని ఉద్గారించి,శివుడి నుదుటి నుండి,విష్ణువు ముఖం నుండి,బ్రహ్మదేవుని శరీరం నుండి,ఇంద్రుడు మరియు ఇతర దేవతల కాంతుల నుండి,అన్నీ కలిపి ఒక అద్భుతమైన జ్యోతి వెలువడింది. ఆ జ్యోతి ఒక్కటిగా కలిసి ఒక అద్భుతమైన స్త్రీ రూపం తీసుకుంది. ఆమెనే దుర్గాదేవి.
ఆమెకు దేవతలు తమ తమ ఆయుధాలను అందజేశారు:
శివుడు – త్రిశూలం
విష్ణువు – సుదర్శన చక్రం
ఇంద్రుడు – వజ్రాయుధం
వరుణుడు – శంఖం
అగ్ని – శక్తి
వాయువు – విల్లు, బాణాలు
యముడు – దండ
హిమవంతుడు – సింహం (వాహనం)
ఆమె రూపం అద్భుతం – కాంతివంతమైన ముఖం, ఎనిమిది చేతులు, ప్రతి చేతిలో ఒక దేవత ఇచ్చిన ఆయుధం, సింహవాహనంపై కూర్చున్న ఆ రూపం చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు.ఈ శక్తులన్నీ చేతబట్టి, దేవి సింహవాహనంగా మహిషాసురునిపై యుద్ధానికి బయలుదేరింది.
దుర్గాదేవి సృష్టి,యుద్ధం
మహిషాసురుడు తన సైన్యంతో కలిసి యుద్ధరంగంలోకి వచ్చాడు. తొమ్మిది రోజులపాటు దేవి మహిషాసురుడితో ఘోరంగా యుద్ధం చేసింది. మహిషాసురుడు తన మాయాశక్తితో ఎద్దుగా, ఏనుగుగా, సింహంగా మారుతూ దేవిని ఎదుర్కొన్నాడు. ప్రతి రూపంలో అతడు ప్రబలమైన శక్తిని చూపించాడు. కానీ దేవి ప్రతిసారి తన శక్తితో అతన్ని ఎదుర్కొన్నది. చివరగా దశమి రోజున, మహిషాసురుడు మళ్లీ ఎద్దు రూపంలోకి మారి దాడి చేయగా, దేవి తన త్రిశూలాన్ని ఎత్తి అతని గుండెల్లో పొడిచి సంహరించింది. అలా మహిషాసురుడు అంతమై, ధర్మానికి విజయమొచ్చింది.
ముగింపు,నవరాత్రుల ప్రాముఖ్యత…
మహిషాసురుని సంహారం తర్వాత దేవతలందరూ సంతోషించారు. దుర్గాదేవిని “మహిషాసుర మర్దిని” అని సంబోధించారు. ఈ విజయాన్ని గుర్తు చేసుకోవడమే నవరాత్రి ఉత్సవాల ఆరంభం. తొమ్మిది రోజులు అమ్మవారి తొమ్మిది రూపాలను పూజిస్తారు: శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి. చివరగా దశమి రోజున విజయదశమి జరుపుకుంటారు. ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే – అహంకారం ఎంత బలమైనదైనా అది చివరికి నాశనం అవుతుంది. స్త్రీ శక్తి విశ్వాన్ని కాపాడే పరమశక్తి. ధర్మం, సత్యం ఎల్లప్పుడూ గెలుస్తాయి. అందుకే మనం నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటూ, అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తాం