Lord Rama and the little squirrel: ఉడుతాభక్తి !

bharatiyasampradayalu
Lord Rama and the little squirrel

ఉడుతా భక్తి అంటే ఎవరికి వారు వారికి చేతనైనంత సహాయం చేయడం. అది రూపాయ కావచ్చు, వెయ్యి రూపాయలు కావచ్చు.. ఎంతైనా కావచ్చు. చేయాలి అనే కోరిక ముఖ్యం. ఒక్కొక్క నీటి బొట్టే పెద్ద వానగా మారినట్లు అనేక మంది చేసే చిన్న చిన్న సహాయాలే పెద్ద మొత్తంగా మారిపోతాయి.

ఈ జాతీయం మన ఇతిహాసమైన రామాయణ గాధ నుండి వ్యాప్తి చెందింది. రావణాసురుడు సీతాదేవిని అపహరించి లంకలోని అశోకవనంలో బంధించాడు. శ్రీరాముడు సీతాదేవి జాడకోసం వెదుకుతూ సుగ్రీవునితో స్నేహం చేసి అతని శత్రువైన వాలిని సంహరించి కిష్కింధ నగరానికి సుగ్రీవుని రాజుగా చేశాడు. సుగ్రీవుడు రామునికి ఇచ్చిన మాట ప్రకారం సీతాదేవిని వెతకడానికి సైన్యాన్ని నాలుగు వైపులా పంపించాడు.

దక్షిణం వైపు వెళ్ళిన హనుమంతుడు అడ్డం వచ్చిన సముద్రాన్ని దాటి లంకకు చేరాడు. అశోకవనంలో సీత ఉందని తెలుసుకొని తిరిగివచ్చి రామునికి చెప్పాడు. రాముడు లంకపై దండెత్తడానికి వానర సైన్యంతో బయలుదేరాడు. సముద్రాన్ని దాటడం కోసం దారి ఇవ్వమని వేడుకున్నా సముద్రుడు లెక్కచేయలేదు. దాంతో ఆగ్రహించిన రాముడు సముద్రం మీదకు బాణం ఎక్కు పెట్టాడు. భయపడ్డ సముద్రుడు చేతులు జోడించి రాముని ముందు ప్రత్యక్షమై తనపై వేసే రాళ్ళు, చెట్లూ అన్నీ నీటిలో తేలేలా చేస్తానని వారధి కట్టి సముద్రం దాటమని చెప్పాడు. దాంతో వానరులంతా పెద్ద ఎత్తున ఉత్సాహంతో ఆనకట్ట కట్టడం మొదలు పెట్టారు.

వానరులంతా పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొచ్చి ఆనకట్ట కడుతున్నారు గదా… అక్కడ ఒక చెట్టుమీద ఒక చిన్న ఉడుత వుంది. దానికి రాముడంటే అమితమైన ఇష్టం. తానుగూడా రామునికి ఆనకట్ట కట్టడంలో సహాయపడాలి అనుకొంది. కానీ ఉడుత చాలా చిన్నది కథ. పెద్ద పెద్ద రాళ్ళూ మోసుకొని వచ్చే శక్తి దానికి ఎక్కడిది. అయినా  ఆ ఉడుత అట్లా అనుకోలేదు. రాముడు చేయబోయే ఈ మంచి పనికి తాను తోడుగా నిలబడాలి అనుకొనింది. వెంటనే పోయి ఇసుకలో పొర్లాడింది. అప్పుడు దాని ఒళ్ళంతా ఇసుక అంటుకోగానే అది వనరులు కట్టే ఆనకట్ట వద్దకు వెళ్లి, అక్కడ ఇసుకను విదిలించింది. అట్లా ఆ ఉడుత ఒక్క క్షణం గూడా ఆగకుండా అలసిపోకుండా మరలా మరలా అదే పని చేయసాగింది.

రాముడు ఆ ఉడుత భక్తిగా చేస్తున్న పనిని చూశాడు. దాన్ని ప్రేమగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. తమ్ముడు లక్ష్మణునికెళ్ళి చూసి “చూశావా… తమ్ముడు… ఇది నిజమైన భక్తి అంటే. ప్రతి ఒక్కరూ ఇలా తమంతట తాము, తనకు చేతనైనంత సహాయం చేస్తూ మంచి పనులకు మద్దతుగా నిలబడాలి. అప్పుడే లోకంలో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది. మనకు ఏం చేతనవుతుందిలే, మనం సహాయం చేస్తే ఎంత, చేయకుంటే ఎంత, మనం సహాయం చేసినా అది పెద్దగా ఉపయోగపడదులే… ఇలాంటి భావనలు వదలుకోవాలి. ఇక్కడ మనస్ఫూర్తిగా చేస్తున్నామా లేదా అనేదే ముఖ్యం. ” అంటూ ఆ ఉడుత వీపు మీద ప్రేమగా మూడు వేళ్ళతో నిమిరాడు.

అంతకు ముందు వరకు ఉడుతకు వీపుమీద చారలు వుండేవి కావు. రాముడు ఎప్పుడైతే సంతోషంగా నిమిరాడో ఆ చేతివేళ్ళ గుర్తులు ఉడుత మీద పడి అట్లాగే శాశ్వతంగా వుండిపోయాయట. ఇప్పటికీ మనం ఉడుత వీపుమీద గుర్తులు చూడవచ్చు. అప్పటినుంచీ చిన్నదైనా పెద్దయినా ఎవరికి చేతనైన సాయం వారు చేస్తే దానిని ఉడుతా భక్తి అంటారు.

Share This Article