పంచాంగములో వ్యక్తి గోచార విభాగములో సమాజములోని ప్రతి మనిషికీ వ్యక్తిగతముగా సంవత్సర కాలము ఎలా వుండబోతున్నదో సూచనప్రాయంగా తెలుసుకోవడానికి క్రింది అంశాలలో ఫలితములు తెలియచేస్తారు.ఈ అంశముల గణనకు తిథి, వారము, నక్షత్రము, కరణము, నవగ్రహములు, రాశుల అంకెలనే ఉపయోగిస్తారు. ఎంతో ప్రాచీన కాలమునుండి వీటి గణనావిధానం స్థిరపడి వున్నది
1. కందాయ ఫలములు:
2. ఆదాయ వ్యయములు:
3. రాజపూజ్య, అవమానములు:
4. రాశి చక్రములో గ్రహముల పరిభ్రమణముననుసరించి – గ్రహచారము (ద్వాదశ రాశులవారికి)
- కందత్రయ (కందాయ) ఫలములు:
కందాయములనగా ఆకాశమందలి అశ్విన్యాది నక్షత్రములు భూమియందుండు మనుష్యులకు యిచ్చునట్టి ఫలితములు అని అర్ధము. ప్రతి మనిషికీ శరీరము, మనస్సు, ఆత్మ అని మూడు స్థితులు ఉంటాయి. ప్రతి మనిషీ జనన సమయములో చంద్రుడు వున్న ఒక నక్షత్రము క్రింద వర్గీకరించబడుతాడు. అదే అతడి జీవితకాల గుర్తింపు నక్షత్రము. దానినే జన్మ నక్షత్రము అంటారు. దీని ఆధారముగా ఈ మూడు స్థితులలో ఆ సంవత్సరం ఎలా ఉంటుందనేది సరి, బేసి మరియు సున్నా అంకెల ద్వారా సూచిస్తారు.సున్నాలు, బేసి (విషమ), సరి అంకెలయినచో ఫలితములు క్రింది శ్లోకములో వివరించారు.
ఆది శూన్యే మహా వ్యాధిర్మధ్యశూన్యే ఋణాధికం,
అంత్య శూన్యే ఫలమ్ స్వల్పం త్రిశూన్యే నిష్ఫలం భవేత్
విషమే చార్థలాభం స్యాత్ సమేత్ సమతాభవేత్
శూన్యే శూన్య ఫలం జ్ఞేయం కందాయ ఫలమీరితిమ్
2. ఆదాయ వ్యయములు:
రోగారోగౌ పుణ్యపాపౌ లాభా లాభౌ జయాజయా !
సుఖదుఃఖే వృద్ధిహీనా నాదాయ స్వ్యయ సంజ్ఞికా !!
జన్మ నక్షత్రమును బట్టి జన్మ రాశి తెలుస్తుంది. ప్రతి రాశి వారికీ రాశ్యాధిపతిని బట్టి సంవత్సరములో వుండు ఆదాయ వ్యయముల అంకెలు పై శ్లోకములో వివరించిన విధంగా సంవత్సర కాలములో వివిధ జీవన విషయాలలో ఫలితములను సూచిస్తాయి.
వీటిని కేవలము ద్రవ్య సంపాదన మరియు చేయు ద్రవ్య ఖర్చు కు ఆపాదించుకోవడం అజ్ఞానమే అవుతుంది.
ఈ అంశము ఆధారంగా రాబోయే సంవత్సర కాలములో తనకు సమాజం నుండి, ప్రకృతినుండి లభించేది ఆదాయముగా తాను సమాజమునకు, ప్రకృతికి ఇవ్వవలసినది లేదా పోగొట్టుకొనవలసినది వ్యయముగా భావించాలి.
ఆదాయము వ్యయముకన్నా ఎక్కువగా ఉంటే తనకు దైనందిన జీవితములో ‘కాలం’ ఎక్కువసార్లు అనుకూలముగా ఉంటుందని అనుకోవచ్చును. వ్యయం ఎక్కువున్నపుడు ఇతరులకు ఎక్కువ సాయపడవలసి వస్తుందని దైనందిన జీవితములో ‘కాలం’ ఎక్కువసార్లు (సూచించిన ఆదాయవ్యయ నిష్పత్తిలో) ప్రతికూలంగా వుండే సూచనలు ఉన్నట్టు గ్రహించాలి.
3. రాజ పూజ్య రాజావమానములు:
ఇవి కూడా ప్రతి రాశి వారికీ రాశ్యాధిపతిని బట్టి గణించబడుతాయి. వీటి ద్వారా సంవత్సర కాలములో ఒక వ్యక్తికి ఆ వ్యక్తి ప్రవర్తనను బట్టి ఇతరుల (ముందున్న ప్రపంచము) స్పందన ఆ వ్యక్తికి ఎలా అనిపింపచేస్తుందో సూచన ప్రాయంగా తెలుస్తుంది.
పూజించబడటం అవమానించబడటం అనేవి మనస్సుకు, అహమునకు (ఈగో) సంబంధించిన భావనలు. శతాబ్దాలుగా స్థిరపడిన గణనావిధానం తో రాబోవు సంవత్సర కాలములో వ్యక్తులు తమ రాశిని బట్టి తమ ప్రవర్తన తో ఎదుటివారి స్పందన పూజించినట్లుగా లేక అవమానించబడినట్లుగా భావించడం ఏ నిష్పత్తిలో వుంటుంది అనేది ఈ అంశము ద్వారా అంచనా వేసుకోవచ్చును. అంతేకాదు దీని ఆధారంగా తగు జాగ్రత్తలు పడవచ్చును.
ఈ అంశమును ఇతరులు తనను ఎన్ని సార్లు పూజించడం లేదా అవమానించడం చేస్తారు అనేదిగా అపార్థము చేసుకోకూడదు.
ఈ అంశము పై పరిశోధన జరుగవలసిన అవసరం ఎంతైనా వున్నది.
రాశుల వారీగా ఫలితాలను ముందుగా తెలుసుకోవడం వల్ల ఎవరికి వారు ఆ సంవత్సర ప్రణాళిక తయారు చేసుకోవచ్చు..
కందాయ ఫలములు, ఆదాయవ్యయములు, రాజపూజ్య రాజావమానములు అనేవి ప్రాచీన కాలములో, రాబోయే ఒక సంవత్సర కాలంలో వ్యక్తుల సాంఘిక జీవనం ఎలా వుంటుందో అంచనా వేసుకోవడానికి గణితం ఆధారంగా చేసుకున్న ఏర్పాటు అంశములు మాత్రమే.
పంచాంగములో వుండే ఈ అంశములు అవి ఉపయోగించడం మొదలుపెట్టిన కాలములో అప్పటి జీవన విధానమునకు సంబంధించినవి. వాటిలో గణితం వుంది కనుక వాటిని నేటి కాలానికి అనుగుణంగా అర్ధం చేసుకునే ప్రయత్నం చేయాలి కానీ ఈ నాటి జీవన విధానానికి పూర్వీకులు ఏర్పాటు చేసినవి అనుకోవడం సరి కాదు.
వాస్తవంగా ఆలోచిస్తే ఈ కాలములో కూడా మనకు ఇలాంటి సాధనములు లేవు.
(జాలా సోమనాథ శాస్త్రి, హైదరాబాద్)