కబంధ హస్తం
కబంధుడు ఒక దనుజుడు. భయంకరమైన ఆకారం. వీడికి తల,కాళ్ళు లేవు. ఒక యోజనం విస్తీర్ణమైన పొట్ట ఉంది. అంతకన్నా పెద్దవైన చేతులున్నాయి. పొట్టలోనే కళ్ళు. ఇంత పెద్దవైన చేతులు త్రిప్పుతూ , చేతులకు చిక్కిన వారిని పొట్టలో వేసుకుంటూ ఉంటాడు. ఇతని కథ రామాయణంలో ఉన్నది . రామలక్ష్మణులు సీతను వెదుకుతూ వెళుతుండగా వారు ఈ దనుజుడి చేతికి చిక్కారు. వాడు వీరిద్దరిని మ్రింగబోయాడు. కాని, రాముడు , లక్ష్మణుడు ధైర్యంతో కబంధుడి హస్తాలు నరికివేశారు. శాపవశాన వికృతరూపంతో పుట్టిన కబంధుడుదాంతో శాపవిమోచనం పొంది దివ్యరూపం ధరించాడు.
కబంధుడి చేతులలో చిక్కిన ప్రాణి తప్పించుకొని బయటపడడం సాధ్యం కాదు. అందుకనే లోకంలో “కబంధ హస్తం” అనే మాట చెడు అర్థంలో రూఢమై పోయింది.
కబంధుడి వృత్తాంతం!
జటాయువు మరణానంతరం రామ, లక్ష్మణులు అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా, అకస్మాత్తుగా ఒక ఘోరమైన శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఏమై ఉండొచ్చు అని అనుమానం వచ్చి, చుట్టూ చూస్తే, అసలు సృష్టిలోనే కనీవినీ ఎరుగని ఓ భయంకరమైన రూపం కనబడింది.
ఆ ఆకారానికి తల, కాళ్లు ఏవి లేవు. కేవలం ఛాతీ నుంచి నడుము వరకు మాత్రమే శరీరం ఉంది. కానీ దానిలోనే ఒక భారీ నోరు, ఒక పెద్ద కన్ను కనిపించాయి. ఆశ్చర్యకరంగా, ఆ కన్ను చాలా దూరం ఉన్న వస్తువులను కూడా చూడగలిగింది. అంతేకాదు, దానికి యోజనమంత పొడవున్న చేతులుండగా, అవి భయంకరంగా వ్యాపించి కనిపించాయి. నడవలేని ఈ అద్భుతాకృతి, తన చేతులతో చెట్లను తడుముతూ దొరికిన ప్రతిదానిని పట్టుకొని తినిపోతోంది.
ఈ వింత శరీరాన్ని చూసి రామ, లక్ష్మణులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. “ఇది ఏంటి ? ఎందుకు ఇలాగుంది?” అని ఆశ్చర్యపోతూ ఉండగానే, ఆ ప్రబలమైన శరీరం ఒక్కసారిగా తన రెండు చేతులను విప్పి, రామ, లక్ష్మణులను గట్టిగా పట్టేసింది.
“నాకు కబంధుడు అని పేరు. నేను రాక్షసుడిని. మీరు ఈ అరణ్యానికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు నేను మీ ఇద్దరినీ తినేస్తాను” అని ఆ రాక్షసుడు గర్జించి వాళ్ళని దగ్గరిగా తీసుకునే ప్రయత్నంలో ఉండగా, లక్ష్మణుడు రాముడి వైపు తిరిగి, “అన్నా, ఈ దానవుని ఉపేక్షిస్తే, మనిద్దరినీ తినేస్తాడు. వీడి చేతులని ఖండించేద్దాము” అన్నాడు.
వెంటనే లక్ష్మణుడు ఎడమ బాహువుని, రాముడు కుడి బాహువుని సరికేశారు.. అప్పుడు కబంధుడు వేదనతో కేకలు వేసి, “మీరు ఎవరు?” అని ప్రశ్నించాడు.
“ఈయన రాముడు, అయోధ్య రాజు దశరథుడి కుమారుడు. తండ్రి మాట కట్టుబడి 14 సంవత్సరాల అరణ్యవాసానికి వచ్చాడు. కానీ, రాక్షసులు ఆయన భార్య సీతమ్మను అపహరించారు. ఆమె కోసం మేము అరణ్యంలో వెతుకుతున్నాం. నువ్వు అసలు ఎవరు? నీ రూపం ఎందుకు ఇలాగా ఉంది?” అని లక్ష్మణుడు ప్రశ్నించాడు.
దీనికి కబంధుడు, “నా కథ చెబుతాను. కానీ, మీరు నాకు ఒక సహాయం చేయాలి. నాకు చితి నిర్మించి, నా శరీరాన్ని దహనం చేయండి,” అన్నాడు.
“సరే, నిన్ను కాల్చుతాములే గానీ, నువ్వు రాక్షసుడివి కదా, సీతమ్మ గురించి నీకు ఏమైనా తెలుసా?” అని రామ, లక్ష్మణులు అడిగారు.
“ఈ శరీరంతో నేను ఏమి చెప్పలేను.. కానీ, నన్ను కాల్చేస్తే, నా అసలు రూపం వస్తుంది. అప్పుడు మీకెవరు సీతమ్మను తీసుకెళ్లారో చెబుతాను,” అన్నాడు.
“కాలుస్తాము, కానీ ముందు నీ అసలు కథ చెప్పు,” అని రాముడు చెప్పాడు.
అప్పుడు కబంధుడు చెప్పిన కథ—
“నేను పూర్వంలో ధనువు అనే గంధర్వుడిని. ఎంతో తేజస్సుతో ఉండేవాడిని. నా శరీరం సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడిని మించిన కాంతితో ప్రకాశించేది. నా అందాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. అప్పుడు ఒక రోజు, నా మనసులో ఓ ఆలోచన వచ్చింది— నేను కామరూపి కనుక, ఒక భయంకరమైన స్వరూపాన్ని తీసుకుని అడవిలో భయపెట్టాలని అనుకున్నాను.
వెంటనే నేను భయంకరమైన రూపాన్ని తీసుకుని అడవిలోకి ప్రవేశించాను. అక్కడ స్థూలశిర మహర్షి దర్భలు ఏరుకుంటూ ఉండగా, నేను వెనకనుండి భయపెట్టేలా ఒక భీకరమైన కేక వేశాను. మహర్షి వెనక్కి తిరిగి నన్ను చూశారు. “ఈ రూపం నీకు ఎంత ఆనందంగా ఉందో, ఇక ఇది నీకే ఉండాలి,” అంటూ నాకు శాపం ఇచ్చారు.
అప్పుడు నేనతని కాళ్ల మీద పడి, “ఓ మహర్షీ! ఈ శాప విమోచనం ఎలా సాధ్యమవుతుంది?” అని అడిగాను.
అప్పుడు మహర్షి, “ఇక్కడ రామలక్ష్మణులు వచ్చి, నీ చేతులు నరికినప్పుడు నీ శాపం తొలగిపోతుంది,” అని చెప్పారు.
ఇప్పుడు మీ ఇద్దరూ నా చేతులను తొలగించారు. ఇక మీరు నాకు చితి వేసి దహనం చేయాలి. అప్పుడు నేను నా అసలు రూపానికి వస్తాను. అప్పుడే మీకేమి చేయాలో చెబుతాను,” అన్నాడు కబంధుడు.