‘జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే’
…చాలామందికి సుపరిచితమైన విద్యారంభ శ్లోకమిది. చదువులకు అధిదేవత సరస్వతీదేవి. మళ్లీ ఈ హయగ్రీవుడు ఎవరు? జ్ఞానం కోసం ఆ స్వామిని ఎందుకాశ్రయించాలి? అన్న సందేహాలు కలగటం సామాన్యమే. అదంతా తెలియాలంటే హయగ్రీవ అవతార క్రమాన్ని అర్థం చేసుకోవాలి.
శ్రావణ పూర్ణిమనాడు హయగ్రీవుడు ఆవిర్భవించాడు. విష్ణువే అలా ఓ విశిష్ట అవతారాన్ని ధరించాడు. హయగ్రీవం అంటే గుర్రపు ముఖమని అర్థం. మెడ నుంచి పైదాకా గుర్రపు ముఖంతోనూ, మెడ కింద భాగమంతా మహావిష్ణువు పోలికలతోనూ ఉండడం అవతార విశేషం.
ఈ దేవుడిని అర్చిస్తే విద్యలు, తెలివితేటలు దైవప్రసాదంగా లభిస్తాయన్నది భక్తుల విశ్వాసం. తెల్లని దేహఛాయతో, అంతకంటే తెల్లని దుస్తులతో కొలువైనట్టు ఈ స్వామిని పురాణాలు వర్ణించాయి.
ఎన్నో కథలు…
హయగ్రీవస్వామి కాలానికి అందనివాడు. సృష్టికి ముందున్నవాడు. సృష్టికర్త అయిన బ్రహ్మకు సృష్టి చేసే జ్ఞానాన్ని ఇచ్చేది వేదాలే. అందుకే, ఆ వేదాల సంరక్షణలో నిరంతరం మహావిష్ణువు నిమగ్నమై ఉంటాడు. అందుకోసమే విష్ణువు హయగ్రీవ అవతారాన్ని ధరించాడు. సృష్టి ప్రారంభంలో ఓసారి, మహావిష్ణువు నాభి కమలంలో కూర్చొని ఉన్న బ్రహ్మ తన పనిలో తాను నిమగ్నమై ఉన్నాడు. ఇంతలో మధుకైటభులు మెల్లగా వెనుక నుంచి వచ్చి వేదాలను అపహరించారు. చూస్తుండగానే ఆ ఇద్దరు రాక్షసులూ సముద్రజలాలలో అట్టడుగునకు వెళ్ళిపోయారు.
వేదాలు లేకపోతే సృష్టి చేయడం ఎలా? అని విచారించసాగాడు బ్రహ్మ. ఆ సంక్షోభ సమయంలో ఆయనకు విష్ణువు గుర్తుకొచ్చాడు. వెంటనే విష్ణువును స్తుతించాడు. పరిస్థితి తీవ్రతను గమనించిన విష్ణుమూర్తి క్షణాలలో ఒక దివ్య శరీరాన్ని పొందాడు. ఈ హయగ్రీవ స్వరూపంతో రసాతలానికి చేరాడు. అక్కడ స్వామి ఉదాత్త, అనుదాత్త స్వరయుక్తంగా సామవేదాన్ని గానం చేశాడు. ఆ మధురగానవాహిని రసాతలమంతా మారుమోగింది. ఆ గానరసం రసాతలంలోనే ఉన్న మధుకైటభ రాక్షసులు చెవులకూ సోకింది.
ఆ నాదానికి పరవశించిన అసురులు, తాము దొంగిలించిన వేదాలను ఒకచోట భద్రం చేసి… నాదం వినిపిస్తున్న దిక్కుకు పరుగులు తీశారు. ఇంతలో హయగ్రీవుడు, రాక్షసులు దాచిన వేదాలను తీసుకొని సముద్రగర్భం నుంచి బయటకు వచ్చాడు. హయగ్రీవ రూపాన్ని విడిచి స్వస్వరూపాన్ని ధరించాడు. మధు కైటభులు గానం వినిపించిన దిక్కుకు వెళ్లారు. ఎంత వెతికినా ఏమీ కన్పించలేదు. నిరుత్సాహంగా వేదాలను దాచిన చోటుకు తిరిగొచ్చారు. వారికక్కడ వేదాలు కన్పించలేదు.
వెంటనే బయటకొచ్చిన ఆ రాక్షసులకు… సముద్రతలం మీద దివ్యతేజస్సుతో అలరారుతూ ఆదిశేషుడి పడగల నీడలో యోగనిద్రా ముద్రలో ఉన్న విష్ణువు దర్శనమిచ్చాడు. రసాతలంలో తాము దాచిన వేదాలను తీసుకువెళ్ళింది ఆయనేనని నిర్ణయించుకొన్నారు. స్వామి మీదకు యుద్ధానికి వెళ్ళారు. లోకకంటకులూ అధర్మవర్తనులూ అయిన ఆ ఇద్దరు దైత్యులను సంహరించాడు విష్ణువు.
అలా వేదోద్ధరణ దిశగా హయగ్రీవ అవతరణం జరిగింది. అప్పుడే హయగ్రీవుడు వేదాధిపత్యాన్ని బ్రహ్మకు, సకల విద్యాధిపత్యాన్ని సరస్వతికి అప్పగించాడు. అందుకే హయగ్రీవ ఉపాసన చేసినా హయగ్రీవ జయంతి నాడు ఆ స్వామిని స్మరించినా జ్ఞానానందాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు.
ధర్మరక్షణ కోసం
మహావిష్ణువు అవతారాలన్నీ ధర్మరక్షణ నేపథ్యంలోనే జరిగాయి. పూర్వం విచిత్రంగా హయగ్రీవుడు అనే పేరున ఓ రాక్షసుడు కూడా ఉండేవాడు. ఆదిపరాశక్తిని గురించి తపస్సు చేసి, తనకు మరణం లేకుండా వరం కోరుకొన్నాడు. అమ్మ అలా కుదరదంది. హయగ్రీవుడు కొంత తెలివిగా ఆలోచించి, గుర్రపు మెడతో ఉన్నవాడి వల్ల మాత్రమే తనకు మరణం సంభవించేలా వరం ఇమ్మన్నాడు. మనిషి శరీరానికి గుర్రపు మెడ ఉండే జీవి సృష్టిలో ఎక్కడా ఉండదని ఆ రాక్షసుడి నమ్మకం.
ఇక అప్పటి నుంచీ హయగ్రీవ రాక్షసుడు సర్వలోకాలను వేధించసాగాడు. దేవతలంతా విష్ణువును శరణువేడారు. విష్ణుమూర్తి చాలాకాలం పాటు నిర్విరామంగా రాక్షస సంహారం చేసి అలసిపోయాడు. ఓ రోజున ఎక్కుపెట్టి ఉన్న ధనుస్సు మీదనే తల ఆనించి నిద్రకు ఉపక్రమించాడు. ఎన్నాళ్ళకూ నిద్ర నుంచి లేవకపోయే సరికి శివుడు దేవతలకు ఓ ఉపాయం చెప్పాడు.
ఎక్కుపెట్టి ఉన్న ధనుస్సుకు బిగించిన అల్లెత్రాడును తెంపగలిగితే ఆ కదలికలకు విష్ణువుకు మెలకువ వస్తుందన్నాడు. ఆ తాడును కొరకగల శక్తి ఒక చెదపురుగుకు మాత్రమే ఉందని బ్రహ్మాది దేవతలకు అర్థమైంది. దానికే ఆ పని అప్పగించారు. చెదపురుగు తాడును కొరకటంతో ధనుస్సు కొన బలంగా విష్ణువు శిరస్సుకు తగిలింది. ఆ తల ఎగిరి ఎటో దూసుకువెళ్లింది. దాని కోసం అన్నిచోట్లా వెతికారు. అయినా ఫలితం లేకపోయింది.
ఇక చేసేది లేక ఆదిపరాశక్తిని స్తుతించారు. ఆ అమ్మ ప్రత్యక్షమై… ఏదైనా గుర్రపు మెడను తెచ్చి విష్ణువు శరీరానికి అతికించమంది. దేవతలు శిరసావహించారు. అలా హయగ్రీవ స్వామి అవతరణ, రాక్షస సంహారమూ జరిగింది.
దేవతలంతా ఆ స్వామిని వేద మంత్రాలతో స్తుతించారు. ఇది జరిగింది శ్రావణ పూర్ణిమనాడు. అప్పటి నుంచి హయగ్రీవ జయంతి జరుపుకోవటం ఆచారంగా వస్తోందని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఇక్కడ సామాజికంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. అవయవ మార్పిడి ప్రస్తావన భారతీయ పురాణాల్లో ఏనాటి నుంచో కనిపిస్తోంది.
తలకు బదులుగా తలను అమర్చే గొప్ప శస్త్రచికిత్సా విధానం ఇది. గణేశుడికి ఏనుగు తల, దక్షప్రజాపతికి మేక మెడ, హయగ్రీవ స్వామికి గుర్రపు మెడ… ఇవన్నీ అలనాటి శస్త్రచికిత్సా పరిజ్ఞానానికి సూచికలు. మన భారతీయ ఋషి విజ్ఞానతత్త్వానికి నిదర్శనాలు.