Bhagavad Ramanujacharya: భగవద్రామానుజులు-“సమభావనకు బాట వేసిన మహనీయుడు” (1017-1137) Part-3

bharatiyasampradayalu
Bhagavad Ramanujacharya

ఆళవందారుల ప్రధానకేంద్రం శ్రీరంగం. అక్కడి వైష్ణవులు యతి రాజులను శ్రీరంగంలో నిలుపవలెనని నిశ్చయించి ఒక ఉపాయం ఆలోచించి ఆళవందారుల ముఖ్యశిష్యులు భగవదనుగ్రహపాత్రులైన మహా గాయకులు తిరువరంగం పెరుమాల్రాయరులను కంచికి పంపారు. ఆయన తమ అమోఘమైన దివ్యప్రబంధ స్తోత్రగానంతో రామానుజులను మెప్పించి, వరం పొంది, రామానుజులను శ్రీరంగం రావటానికి ఒప్పించారు. రామానుజులకు శ్రీరంగంలో గొప్ప స్వాగతం లభించింది. ఆళవందారులకు ఉత్తరాధికారిగా యతిరాజులు శ్రీరంగం దేవళంలో శిథిలావస్థలో ఉన్న కొన్ని ప్రదేశాలను బాగు చేయించి పుష్పవాటికలు నాటించి ఆలయపూజలో క్రొత్త కట్లుబాట్లు చేయించారు.

వైష్ణవమతం కేవలం పండితచర్చలవరకే పరిమితం కాకుండా ఆలయంలో ఉత్సవాలు, భాగవత పురాణగాథల సంగీత రూపకాలు, దివ్యప్రబంధ గానాలు ఏర్పాటు చేయించి వైష్ణవం సామాన్యజనులకు ఆకర్షణీయం చేశారు. పెరియనంబి ఆదేశంతో ద్వయమంత్రమహార్థం తెలుసుకోవటానికై గోష్ఠీపూర్ణ నామాంతరంగల తిరుక్కోష్ఠియూరునంబి సన్నిధికి వెళ్లారు. ఆయన యతిరాజుల శ్రద్ధను పరీక్షించటానికై 18 పర్యాయాలు తమ గ్రామానికి తిప్పించుకొని, ఆయన పట్టుదలకు భక్తికి సంతసించి చివరిసారిగా ఒంటరిగా రమ్మన్నారు. చివరిసారి యతిరాజులు కూరేశదాశరథులను తోడ్కొని పోతే గోష్ఠీపూర్ణులు ఒంటరిగా రమ్మంటే ఇరువురిని తోడ్కొని వచ్చినావేమని ప్రశ్నిస్తే దాశరథి నా దండం, కూరేశులు నా ధ్వజ మన్నారు.

గోష్ఠీపూర్ణుల హృదయం ద్రవించింది. మంత్రార్థం బోధించి దీన్ని రహస్యంగా దాచుమన్నారు. మోక్షం ప్రసాదించే దివ్య మంత్రార్థం కొద్దిమందికే పరిమితం కావటం యతిరాజులిష్టపడక మరునా డుదయం తిరుక్కొట్టియూర్ ఆలయగోపురమెక్కి అందరికీ మంత్రార్థం చాటినారు. ఈ వార్త విని గోష్ఠీపూర్ణులు కోపంతో రామానుజులను రప్పించుకొని సమాధానమడిగి మంత్రార్థం వెల్లడి చేసినందుకు నరకం పోతావంటే రామానుజులు నేనొక్కణ్ణి నరకం పోతాను కాని తమ మంత్రార్థరహస్యం విన్న ఇంతజనం ముక్తులౌతారన్నారు. గోష్ఠీపూర్ణుల హృదయం ద్రవించింది.

వారు యతిరాజుల కారుణ్యానికి, భక్తికీ మెచ్చి సజలనయనాలతో ఆలింగనం చేసుకొని ‘ఎంబెరుమాన్’ అని సంబోధించినారు. ఆ మాటకు మా ప్రభువు అని అర్థం. పునరుజ్జీవిత వైష్ణవానికి నాయకుడన్నమాట. మాలాధరులు, ఆళవందారుల ముఖతః నమ్మాళ్వారుల తిరువాయిమొళిని అధ్యయనం చేసినవారు. అట్టి మాలాధరులను ఆశ్రయించి తిరువాయిమొళిని (తమిళవేదం) నేర్చుకొమ్మని రామానుజులను గోష్ఠీపూర్ణులాదేశించినారు. యతిరాజులు మాలాధరుల చెంత ఆమంత్రాలు నేర్చుకుంటుంటే వారికి క్రొత్త అర్థాలు తోచినవి. ముందుగా కుపితులైనా యతిరాజుల నిశ్చితావ గాహనకు మాలాధరులు సంతోషించి గురువులకు గురువైనావని అభినందించినారు.

యతిరాజుల విద్యార్థిదశ ముగిసినది. వారి వైష్ణవ వేదాంత బోధనకు ఎందరో ఇతర సిద్ధాంతములవారు ప్రభావితులైనారు. ఈ సమయంలోనే ఉత్తరదేశంలో దిగ్విజయయాత్ర ముగించి స్వదేశానికి తిరిగివచ్చిన యజ్ఞమూర్తి అనే అద్వైతవేదాంతి వచ్చి రామానుజులతో 18 దినాలు వాదించి పాదాక్రాంతులై విశిష్టాద్వైతం పుచ్చుకున్నారు.

యతిరాజులైన రామానుజుల కీర్తి దేశమంతటా మారుమ్రోగింది. వారు శ్రీరంగ దేవాలయానికి సర్వాధిపత్యం వహించి వైష్ణవోద్యమానికి దానిని కేంద్రంగా మలచినారు. అకలంకుడనే చోళసామంతరాజుకు దేవాలయ నిర్వహణం అప్పగించినారు. ఆయనకు మహాబలశాలి ధనుర్దాసు, అంగరక్షకుడు. ఆయనభార్య పొన్నాచి విశాలనేత్రాలుగల కోమలాంగి. ఆ దంపతులు చైత్రోత్సవానికి వచ్చినారు. వీథిలో నడుస్తుంటే ఆమెకు ఎండ తగులకుండా ధనుర్దాసు గొడుగు పడితే యతిరాజుల శిష్యులు యతిరాజుల కాతణ్ణి చూపించి కామాంధు డన్నారు.

రామానుజులాతడు గొప్ప ప్రేమికుడన్నారు. ప్రేమజీవులు నిజంగా భగవదనుగ్రహానికి పాత్రులౌతారని మరునాడుదయం ఇంతకంటే సుందరమైన నేత్రాలు చూపిస్తానని రామానుజులు ధనుర్దాసును గర్భగుడిలోనికి తీసుకపోయి శ్రీరంగనాథుని నేత్రాలు చూపించినారు. ధనుర్దాసు అవాక్కైపోయినాడు. భార్యాభర్తలిరువురు యతిరాజుల శిష్యులై తమ సర్వస్వం మఠానికి సమర్పించినారు. ఈ వార్త తెలిసిన అకలంకుడు రామానుజుల శిష్యుడై వైష్ణవులలో అగ్రేసరుడైనాడు. ఆధ్యాత్మికాభ్యున్నతి సాధించినవారి గుణములకే కాని కులమునకు రామానుజులు ప్రాధాన్యమీయలేదు.

రామానుజుల ఉన్నతాశయాలకూ ఆలయ పూజారుల సంకుచిత మనస్తత్వానికీ సరిపడలేదు. ఉరంగవిల్లి బ్రాహ్మణేతరుడు. మారనేర్నంబి అస్పృశ్యుడు. రామానుజులు వారిని గొప్పగా సంభావించటం శిష్యులకు గాని ఆలయార్చకులకు కాని ఇష్టం కాలేదు. రామానుజులు వారి ఔదార్యము, ప్రపత్తి, సేవాభావములు పరీక్షలద్వారా శిష్యులకెరుక పరచి కనువిప్పు కలిగించినారు. ఆలయపూజారి వర్గం కుట్రపన్ని ఒకసారి విషాన్నం ఒకసారి విషం కలిపిన తీర్థమిచ్చినారు. ఆదిశేషుని అవతారమైన యతిరాజులీ గండములు శ్రీరంగనాథుని అనుగ్రహంతో గడచినారు. కుల, విద్యా, ధన, మదములున్న శిష్యుల చేత ఇతరుల ఇండ్లలో దాస్యం చేయించి సాత్విక సంపన్నులను చేసినారు. యతిరాజులు తమ మేనమామ తిరుమలనంబి చెంత

రామాయణాధ్యయనం చేయటానికి శిష్యసమేతంగా తిరుపతికి పయనమైనారు. త్రోవలో అష్టసహస్ర గ్రామంలో వరదరాయలనే నిరుపేద శిష్యుని భార్య, గురువుల సమర్చనకై సమకట్టిన త్యాగమునకు మహానంద భరితులైనారు. ప్రపంచ భక్తి సాహిత్యంలో ఇట్టి మహత్తర సన్నివేశం అరుదు. వరదరాయదంపతులను ఆశ్వీరదించి, ఆయమ్మ మానము దోచు కొనగోరిన వర్తకుని శిష్యునిగా స్వీకరించి, ధనగర్వాంధుడైన యజ్ఞేశునికి భక్తులు గురువులనెట్లు గౌరవించవలెనో బోధించినారు.

తరువాత రామానుజులు పవిత్రమైన తిరుమలకొండలు కాళ్ళతో గాక మోకాళ్ళపై నడచి పైకి ఎక్కి తన శిష్యుడు భగవత్సేవకై పెంచుతున్న రామానుజ పుష్పవాటిని ఇతర పవిత్ర క్షేత్రాలను దర్శించి, చివరకు శ్రీవెంకటేశ్వరస్వామికి మంగళాశాసనం చేసి మేనమామ తిరుమలనంబి చెంత ఒక సంవత్సరం విశిష్టాద్వైత దృక్పథంతో రామాయణాధ్యయనం చేసినారు. శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి దివ్యశంఖచక్రాలు సమర్పించినారు. తిరుమలకొండ దిగి శ్రీశైలపూర్ణుల యింట మూడుదినాలుండి తమ పిన్నమ్మ కొడుకు గోవిందుని వెంటగొని శ్రీరంగం చేరి శ్రీభాష్యరచనకు పూనిక చేసినారు. ఆదిశంకరులు తమ భాష్యంలో ప్రశంసించిన బోధాయన వృత్తిని చూడటానికై ముఖ్య శిష్యులు కూరేశ ప్రభృతులతో బయలుదేరి ఎంతో శ్రమించి కాశ్మీరం శారదాపీఠంలోనున్న బోధాయన వృత్తిని సంపాదించినారు.

తిరుగు ప్రయాణంలో పోగొట్టుకున్న ఆ గ్రంథాన్ని ఒక్కసారి మాత్రమే చదివి కంఠస్థం చేసుకున్న కూరేశుల జ్ఞాపకశక్తితో బ్రహ్మసూత్రములకు విశిష్టాద్వైతపరంగా భాష్యం రచించినారు. దానికి శ్రీభాష్యమని పేరు. ఈశ్వరుడు సాకారుడనీ, విశిష్టుడనీ, సర్వమునకు మూలమనీ ప్రతిపాదించే విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని శ్రీభాష్యం సమగ్రంగా వివరిస్తుంది. రామానుజులు చెప్పుతుంటే శ్రీభాష్యాన్ని వ్రాసినవారు కూరేశులే. ఇంకనూ కూరేశులు గురువులు చెప్పుతుండగా వేదాంతదీపము, వేదాంతసారము, వేదార్థ సంగ్రహము, గీతాభాష్యములను కూడ వ్రాసినారు. రామానుజ లితః పూర్వమే గద్య త్రయమును, నిత్యమను భగవదారాధన క్రమమును రచించియుండిరి. ఈ గ్రంథాల మూలంగా శ్రీమన్నారాయణుని స్వరూప రూపగుణ విభూత్యాదులు లోకంలో ప్రకాశింపచేయటంచేత శ్రీవారు భగవద్రామానుజుల పేరుతో ప్రసిద్ధులైనారు. శ్రీవారు ఆళవందారుల ఒక వాంఛను పూర్తిచేసినవారైనారు.

భగవద్రామానుజులు శిష్యసమేతంగా ముందుగా దక్షిణదేశం దివ్య క్షేత్రాలు తరువాత ఉత్తరభారత క్షేత్రాలు సేవించి పరవాదులను పరాస్తం చేసి విశిష్టాద్వైతమత ప్రతిష్ఠాపనాచార్యులై వెలిగినారు. శ్రీవారి యాత్రల్లో కురుకాపురి, కురంగనగరి, కాశ్మీర శారద, ద్వారక, కాశీ, బృందావనం, జగన్నాథం, శ్రీకూర్మం, సింహాచలం, అహోబిలం దివ్యదేశములుండినవి. ఆయా ప్రదేశాల్లో అనేక భక్తుల అద్భుత గాథలు శ్రీవైష్ణవ వాఙ్మయంలో ఉన్నవి. తమిళదేశంలో ఆనాడు ప్రబలంగా ఉన్న అద్వైత, విశిష్టాద్వైత శైవ సిద్ధాంతాలకు అహమహమిక ఉండేది. చోళరాజ్యాధిపతి ప్రథమ కులోత్తుంగుడు (1070-1118) పరమశైవుడు. యతిరాజులచేత శివుని కంటె పరదైవం లేడని బలవంతాన ఒప్పించటానికి భటులను పంపితే రాబోయే ప్రమాదం తెలిసి భాష్యకారులు కొలదిమంది శిష్యులతో శ్రీరంగం విడిచి మైసూరు రాజ్యం పోయినారు.

రామానుజుల శిష్యులైన కూరేశులను, పెరియనంబిని రాజభటులు తీసుకపోయి దారుణంగా శిక్షించిన కథలు, గురువులకోసం శిష్యులు చేసిన త్యాగాలు ఒడలు జలదరింప జేస్తవి. వృద్ధులైన పెరియనంబి ఆ బాధతోనే పరమపదించినారు. అంధులైన కూరేశులు శ్రీరంగం చేరినారు. శ్రీరామానుజులు మైసూరురాజ్యం నీలగిరి వనాలలోని ఆటవికులకు, తొన్నూరు పాలించే హెుయసల విఠలదేవుడనే జైనునికి విశిష్టాద్వైత దీక్షలు ప్రసాదించి మీన పుష్కరిణిలో పడవేసియున్న స్వామివారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించినారు. కొంతకాలానికి అక్కడి ఉత్సవ బేరాలను శత్రువులు దొంగిలించ ప్రయత్నిస్తే అక్కడి అస్పృశ్యులు రామానుజులకు సహాయపడి శత్రువులను తరిమినారు.

రామానుజులు అస్పృశ్యులకు దీక్షలిచ్చి ఆలయ ప్రవేశార్హత కల్పించినారు. అస్పృశ్యులకు దేవాలయ ప్రవేశం హిందూ మతచరిత్రలో ఇదే మొదటిసారి. యతిరాజులు వారిని తిరుకులత్తార్ – పవిత్రకులోద్భవులనేవారు. ఆ ప్రభావమే గాంధీమహాత్మునిచే వారిని హరిజనులనిపించినది.

భగవద్రామానుజులు తిరునారాయణపురంలో ఉన్నప్పుడే శ్రీవైష్ణవ మతంలో విప్లవాత్మకమైన సంస్కరణలెన్నో ప్రవేశపెట్టినారు. మైసూరు రాజ్యంలో శ్రీవారు 12 ఏండ్లున్నారు. ప్రథమ కులోత్తుంగుని పాలనం ముగియగానే శ్రీరంగం చేరి ముందుగా కూరేశుల యింటికి పోయి ఆయనను కౌగిలించుకొని “నీ స్పర్శచే నేను పవిత్రుడనైనా” నన్నారు. కనులు పోగొట్టుకున్న కూరేశులను కంచికి తోడ్కొనిపోయి వరదరాజస్వామి సన్నిధిలో నిలిపినారు. కూరేశులు వరదరాజస్తవం పాడితే కంచివరదుడు వరం కోరుకొమ్మన్నాడు.

కనుచూపు కోరుకుంటాడని అందరనుకున్నారు. కానీ కూరేశులు తనను చోళరాజుకు పట్టియిచ్చి తన కండ్లు పీకించటానికి కారకుడైన నలూరాన్ను క్షమించి అనుగ్రహించవలసిందిగా కోరినారు. వైష్ణవ మతంలో క్షమాగుణాని కీసన్నివేశం పరాంకోటి. ఇంతటి క్షమా దయా గుణములు జీసస్ ప్రభువులోనే కనబడుతవి. పురుషులతో పాటు పతివ్రతలైన స్త్రీలకు, భక్తురాండ్రకు భగవద్రామానుజులు ఉచిత స్థానం కల్పించినారు. కూరేశుల చరమదశలో ఆయన కొడుకు, సాటిలేని పండితుడు, ప్రపన్నుడైన పరాశరుని తలపై భగవ ద్రామానుజులు పుష్పకిరీటం పెట్టి దీవించినారు. ప్రియశిష్యుడు తనకంటె ముందే పోవటం శ్రీరామానుజులు భరించలేకపోయినారు.

కూరేశులకు అంతిమసంస్కారం కావేరీతీరంలో జరిపించి ఆ దుఃఖంతో మరల శ్రీరంగం విడిచిపోలేదు. తిరునారాయణ పురం ఆలయంలోను అక్కడి వైష్ణవుల్లోను భగవద్రామానుజులు ప్రవేశపెట్టిన సంస్కరణలు, శ్రీరంగంలో ప్రవేశపెట్టలేక పోయినారు. శిష్యులందరూ ఒక్కరొక్కరే పరమపదిస్తుంటే వారికందరికీ శ్రీరామనుజులే వైభవంగా అంతిమసంస్కారాలు జరిపించినారు.

వారిని వివిధ ప్రాంతాలవారు దర్శించి పోయేవారు. ఆళవందారుల మూడు కోరికలు 1) బ్రహ్మ సూత్రాలకు శ్రీభాష్యం రచించటం 2) కూరేశుల పెద్దకొడుక్కు పరాశరభట్టరని పేరు పెట్టటం 3) నమ్మాళ్వారులకు కృతజ్ఞతగా తమ ఆధ్యాత్మికవారసుడైన నంబిళ్ళను నమ్మాళ్వారులని సంబోధించటం ద్వారా పూర్తిగా తీర్చినారు. తమ అనంతరం శ్రీవైష్ణవమత ప్రచారం సక్రమంగా సాగటానికై 74 మంది శిష్యులను నియమించి ఆ సేతుశీతాచలపర్యంతం శ్రీవైష్ణవధ్వజంరెపరెపలాడించినారు.

120 ఏండ్లు జీవించిన భగవద్రామానుజులు తమ అంత్యం సమీపించగానే పరాశరభట్టరును శ్రీరంగనాథ దాస్య సామ్రాజ్యానికి పట్టం కట్టి ఎంబరు ఒడిలో తల, వడుగనంబి ఒడిలో కాళ్ళు చాచి తమ అంతిమ సందేశాన్ని వినిపించి కపాలభేదనం చేసుకొని పరమపదం చేరినారు. వారి పార్థివశరీరాన్ని వారి శిష్యులు శ్రీరంగం దేవాలయంలోనే ఈజిప్షియన్ మమ్మీలకు చేసినట్టి ఏదో రసాయనిక ప్రక్రియ చేసి భద్రపరిచినారు.

వారి విగ్రహాన్ని తిరుమలలో, కంచిలో, శ్రీపెరుంబుదూరులో ప్రతిష్ఠించినారు. తరువాతకాలాన శ్రీవారి బోధలు భారతదేశంలో బలపడిన అనేకమతాలను, నింబార్క, మధ్వాచార్య, శ్రీవల్లభాచార్య, రామానంద, శ్రీకృష్ణచైతన్య, నామదేవ, తుకారాం, గురునానక్, మీరా, సూరదాస్ వంటి మహాత్ములను, ఆధునికకాలంలో గాంధీ మహాత్ముని ప్రభావితం చేసినవి.

 

ఆధారములు :
1) రామానుజాచార్యులు, ఇంగ్లీషు ఆర్. పార్థసారథి, National Book
Trust, India. 1991
2) భగవద్రామానుజ చరిత్ర – గుదిమెళ్ళ రామానుజాచార్యులు.

Share This Article