పూర్వకాలంలో ‘కలువాయి‘ అనే ఒక గ్రామం ఉండేది. ఆ ఊళ్ళో ఉన్న వారంతా వేదాంతులే. ఒక మండువేసవిలో బాటసారి ఒకడు దప్పిక అయి, నాలుక పిడచకట్టుకొని పోతుండగా ఆ ఊరి వెలుపల ఉన్న ఒక బావి దగ్గరికి వచ్చాడు. అక్కడ నీళ్లు తీసుకోని పోతున్న ఒక స్త్రీ కనపడింది. దాహంతో ఉన్నాను.. చెంబెడు నీళ్లు పొయ్యమని, లేదా చేద అయిన ఇస్తే నీళ్లు తోడుకుంటానని అడిగాడు.
అప్పుడామె “నాయన.. ఈ శరీరాలు నీటిబుడగలాంటివి. క్షణ భంగురాలు.. ఆత్మ మాత్రమే నిత్యమైంది. ఆత్మకు దప్పిక , ఆకలి- ఏవీ లేవు. నీవు నీరు త్రాగినా, త్రాగకపోయినా ఆత్మకు నష్టం లేదు. అలాంటప్పుడు దేనికి నీళ్ల కోసం అంత తాపత్రయం? అయినా నీళ్లేమిటి ? దప్పిక ఏమిటి ? ఇచ్చే వారెవరు పుచ్చుకునేవారు ఎవరు ? – అని ఒక పెద్ద వేదాంతం చెప్పి, చరచర అక్కడ నుండి వెళ్లిపోయింది.
పాపం , ఆ బాటసారి నోటమాట రాలేదు. నోరెండిపోయి , ప్రాణం పొయ్యే స్థితిలో మంచి తీర్థం అడిగితే, ఇలా వేదాంతం చెప్పి వెళ్లిపోయే వాళ్ళను అతను ఇంతవరకూ చూడలేదు కనుక విస్తుపోయాడు. ఏం చేస్తాడు ? గొంతు ఎండిపోతున్నది . అంతలో ఒక వింతతువు బావి దగ్గరికి వచ్చింది. ఆమెనూ బాటసారి ఎంతగానో ప్రార్ధించాడు. కానీ ఆమె కూడా అలాగే ఉపన్యాసం చెప్పి నీళ్లు తోడుకొని వెళ్ళిపోయింది.
ఇక అతనికి సహనం నశించింది. ప్రాణాలు నిలిచేలా లేవు. త్రోవన ఒక చిన్న అమ్మాయి బిందెతో నీళ్లు తీసుకోని పోవడం చూశాడు. గభాలున ఆ అమ్మాయి తీసుకువెడుతున్న బిందెను లాక్కున్నాడు. కడుపునిండా మంచి నీళ్లు త్రాగాడు. తరువాత కడవకూడ భుజాన పెట్టుకొని వెళ్ళిపోసాగాడు.
అప్పుడా ఆ అమ్మాయి పెద్దగా కేకలు పెట్టింది. అది విని ఊరిలో జనం పోగయ్యారు. బాటసారిని నిలబెట్టి ” ఏమిటీ దౌర్జన్యం ? జంకూ గొంకూ లేకుండా బిందె లాక్కొని పోతున్నావే? పట్టపగలే దొంగతనానికి ఒడిగట్టావా? ” అని గద్దించి అడిగారు.
అప్పుడా బాటసారి “మహాజనులారా ! అంతా మీకు తెలుసు . మహా వేదాంతులు, జ్ఞానులు మీరు ఎవరు , నేనెవరు, బిందెఏమిటి ? తీసుకుని పోవడమేమిటి ? అంతా శూన్యం. పరమాత్ముడి లీల. మనందరిలోనూ వెలుగుతున్న పరంజ్యోతి ఒక్కటే. మీది, నాది అనే భేదబుద్ది తప్పు . అవి ఎంతో వినయంగా సమాధానం చెప్పి , బిందె అలాగే భుజాన పెట్టుకొని గబగబ వెళ్ళిపోయాడు. మన వేదాంతానికి తగిన విధంగానే వేదాంతం చెప్పి, బుద్ది వచ్చేలా చేశాడు.. ఈ బాటసారి అనిఅనుకున్నారు.. ఆ ఊరి ప్రజలు. ఈ కథను బట్టే, ఎవరైనా ఇలాంటి మెట్ట వేదాంతాలు చెప్పే వారిని చూచి “కలువాయి వేదాంతం” అని అనడం మాములు అయింది.