భారతీయులు కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువగా నమ్ముతారు. మంచి జరిగినా , మనం చేసిన సుకృత , దుష్కృత కర్మలే వాటికీ కారణమని మన శాస్రాలు,పురాణాలూ చెబుతాయి. అయితే, ఈ పట్టున మనుష్య ప్రయత్నం అక్కర్లేదని అర్థం కాదు. ప్రతి మానవుడు తనకు మంచి జరగాలని కోరుకుంటాడు. అందుకోసమే ప్రయత్నం చేస్తాడు. ఏదైనా చేదు సంభవించినప్పుడు, దానిని తొలగించడానికి కూడా తన శాయశక్తులా కృషి చేస్తాడు.
కానీ , ఈ మానవ ప్రయత్నం అన్ని వేళలా సఫలమవుతుందనటానికి వీలు లేదు. మనిషి ఎంత ప్రయత్నం చేసినా, దాని ఫలితం అతను ఆశించిన దానికంటే భిన్నంగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. జీవితంలో చాలామందికి ఇది అనుభవమైన విషయమే.
ఏఈ కారణం చేతనే అన్నిటికీ మూలమైన కర్మలనేవి ఒకటి ఉన్నదని మన విశ్వాసము. ఈ కర్మలనే దైవంగా కూడా సంభవిస్తాయి. అంతా మన కర్మననుసరించి జరుగుతుంది. అంతా దైవ నిర్ణయం ప్రకారం జరుగుతుంది. ఈ అర్ధాన్నే మనం “సర్వం కర్మాధీనం” ” సర్వం దైవాధీనం” అనే మాటల ద్వారా వ్యక్తం చేస్తూ ఉంటాము. ఈ మాటలు మనం నిత్యం జీవితంలో వాడడం మామూలు అయింది.
సర్వం కర్మాధీనం – అని చెప్పడానికి భారతంలో ఒక చక్కని కథ ఉన్నది. పూర్వం గౌతమీ అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె కుమారుడు ఒకనాడు పాము కరిచి చనిపోయాడు. గౌతమీ తన కుమారుడి కోసం బిగ్గరగా ఏడుస్తున్నది. అప్పుడొక బోయవాడు అక్కడికి వచ్చాడు. బ్రాహ్మణ స్త్రీకి పట్టిన అవస్థ చూశాడు. ఆమె కొడుకును కరిచినా పాము అక్కడే తిరగాడుతున్నది.
“అమ్మా నీ కుమారుడి ప్రాణాలు తీసిన ఈ పామును ఇప్పుడే చంపి వేస్తాను” అని చెబుతూ బోయవాడు ఆ పామును చంపబోయాడు. అప్పుడు గౌతమీ ” అయ్యా నీవు ఆ పామును చంపితే ఏమి లాభం? నా పుత్రుడు మళ్ళీ బ్రతికి రాడు కదా. నా కొడుకు కర్మ అట్లా ఉన్నది. నా కర్మ ఆలా కాలింది, అందుకే ఎవరేం చేస్తారు ?” అని అన్నది.
అంతట బోయవాడు పామును ” నీవి పసివాణ్ణి నిష్కారణంగా ఎందుకు ప్రాణాలు తీశావు?” అని అడిగాడు. అందుకు పాము “అయ్యా నేనేం చేసేది? ఇది నా తప్పు కాదు .మృత్యువు నన్ను ఈ బాలుణ్ణి కరవమని ప్రేరేపించింది.ఈ తప్పు మృత్యువుది కానీ నాది కాదు: అని బదులు చెప్పింది. అప్పుడు బ్రాహ్మణ స్త్రీ, బోయవాడు మృత్యువును నిందించడం మొదలుపెట్టారు. కొంతసేపటికి మృత్యుదేవత అక్కడ ప్రత్యక్షమైంది.
” మీరు నన్ను అనవసరంగా నిందిస్తున్నారు . ఇందులో నా దోషమేమి లేదు. కాలుడు నన్ను పంపాడు. కాలుడు ఏమి చేయమంటే నేను అది చేస్తాను.కనుక దీనికి కారణం కాలుడే అని చెప్పింది. వారంతా కలిపి కాలుని దోషిగా నిర్ణయించి నిందించడం మొదలుపెట్టారు. అప్పుడు అక్కడికి కాలుడు వచ్చాడు.
“మీరంతా నన్నే నిలదీస్తున్నారు.కానీ ఇందులో నా తప్పేమి లేదు . ఈ పని ఒకరు చేశారు. ఒకరు చంపారు అని అనుకోవటం పొరపాటు వీటన్నిటికీ కర్మయే కారణం. కర్మ ఎలా ఉంటే ఆలా జరుగుతుంది. ఇతరులు నిమ్మిత్త మాత్రులు. ఎవరిని నడిపించిన కర్మయే కాబట్టి ఈ బ్రాహ్మణ బాలుని చావుకు పాము కాని,మృత్యువు కాని,కాలుడైన నేను కాని కారణం కానే కాదు.
సర్వం కర్మాధీనం! ఆఖరుకు ఆ భగవంతుడు కూడా కర్మను అనుసరించే నడుస్తున్నాడు. బ్రహ్మ నిరంతరం ప్రాణులను సృష్టిస్తూ ఉండటానికీ, విష్ణువు అనేక అవతారాలు ఎత్తుతూ కష్టాలు పడుతూ ఉండడానికి, సూర్యుడు నిత్యం వేళ తప్పక పొడుస్తూ క్రుంగుతూ తిరుగుతూ ఉండడానికి – కర్మయే కారణం- అని వివరించి చెప్పి కాలుడు అంతర్దానమైనాడు .
అంతటా గౌతమీ తన పుత్రశోకాన్ని విడనాడింది. బోయవాడు కూడా ఆ పామును చంపే ప్రయత్నం విడిచిపెట్టి తన త్రోవన తానూ వెళ్ళిపోయాడు.