శివ తత్వం అంటే సమస్త జగత్తుకు ఒకటే పరమాత్మ అని తెలియజెప్పడం. ఈ తత్వాన్ని ప్రచారంలోకి తీసుకువచ్చే అష్టాదశ శైవ పీఠాల్లో కొలనుపాక సోమేశ్వరాలయం ప్రత్యేకమైనది. ఇది తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో, ఆలేరు మండలంలో ఉంది. దక్షిణ కాశీగా పేరొందిన ఈ పవిత్ర స్థలంలో నలుమూలలా శివలింగాలు కనిపించి భక్తులను ఆధ్యాత్మిక అనుభూతికి లోనుచేస్తాయి.
క్షేత్ర చరిత్ర
కొలనుపాకను ఒక శాసనంలో “కొల్లిపాక” అని పేర్కొన్నారు. విజయనగర రాజుల కాలంలో దీనిని “కొల్పాక్” అని పిలిచేవారు. స్వయంభువుగా వెలసిన పరమశివుడి కొలువుదీరిన ఈ క్షేత్రం “కోటి లింగాల క్షేత్రం” అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇది వీరశైవ సిద్ధ క్షేత్రంగా గుర్తించబడింది. శైవ మత స్థాపకుడైన శ్రీ రేణుకాచార్య ఇక్కడే లింగోద్భవం పొంది, వెయ్యి సంవత్సరాల పాటు భూమిపై శైవ మత ప్రచారం చేసి, చివరికి ఇక్కడే లింగైక్యమైనట్లు సిద్ధాంత శిఖామణి గ్రంథంలో వివరించబడింది.
ఆలయ విశేషాలు
ఈ ఆలయంలో వీరభద్రుడు క్షేత్రపాలకుడిగా, అమ్మవారు చండికాంబగా భక్తులకు దర్శనమిస్తారు. సుమారు 2000 సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయం కల్యాణి చాళుక్యుల కాలంలో ప్రారంభమై, కాకతీయుల హయాంలో పూర్తయినట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి.
పురాణాల ప్రకారం, చంద్రుడు తన శాప విమోచన కోసం ఇక్కడ శివుణ్ని ఆరాధించాడని చెబుతారు. అలాగే అగస్త్య, నారద మహర్షులు ఈ పవిత్ర స్థలాన్ని దర్శించారని పురాణాలు తెలియజేస్తున్నాయి.
సోమేశ్వరాలయానికి అనుబంధంగా భైరవ స్వామి మరియు మల్లిఖార్జున స్వామి ఆలయాలు ఉన్నాయి.
ఎలా చేరుకోవచ్చు
హైదరాబాదు నుంచి 70 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయానికి బస్సు ద్వారా సులభంగా చేరుకోవచ్చు. రైలు మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటే ఆలేరు వద్ద దిగి, అక్కడి నుంచి బస్సు ద్వారా కొలనుపాక చేరుకోవచ్చు.