హిందూ పంచాంగం ప్రకారం, హోలీ పండుగ ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వస్తుంది. హోలీ పండుగను హిందువులతో పాటు ఇతర మతస్తులూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.చిన్నారుల నుండి పెద్దల వరకు ఈ రంగుల పండుగలో పాల్గొని ఉల్లాసంగా ఉంటారు.పురాణాల ప్రకారం, ఈ పండుగ సత్యయుగం నుంచే ఆనవాయితీగా జరుపుకుంటున్నట్లు చెప్పబడింది.
హోలీ పండుగ అగ్నికి సంబంధించినది కాబట్టి దీనిని ‘హోలీకా పూర్ణిమ’ అని కూడా అంటారు. ఈ వేడుకలో కాముని దహనం, డోలికోత్సవం వంటి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర, బర్సానా, నంద గ్రామ పరిసర ప్రాంతాల్లో హోలీ ఉత్సవాలు వసంత పంచమి నుంచి ప్రారంభమవుతాయి. అక్కడ ఈ పండుగ దాదాపు 40 రోజుల పాటు కొనసాగుతుంది. మధుర, వృందావన ప్రాంతాల్లో జరుపుకునే హోలీ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఈ వేడుకలను చూడటానికి విదేశాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తారు.
డోలోత్సవం
హిందూ పురాణాల ప్రకారం, శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి వృందావనంలో పూలతో, రంగులతో ఈ ఉత్సవాన్ని జరిపినట్లు చెబుతారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం స్నేహాన్ని, ప్రేమను పెంచుతుందని విశ్వసిస్తారు. దీన్నే ‘డోలోత్సవం’ లేదా ‘డోలికోత్సవం’ అంటారు.
కృతయుగంలో సూర్య వంశానికి చెందిన రఘునాథ అనే రాజు తన రాజ్యాన్ని పాలిస్తుండేవాడు. అయితే, హోలికా అనే రాక్షసి పిల్లల్ని బాధించటం ప్రారంభించింది. ప్రజలు భయభ్రాంతులై రాజును ఆశ్రయించగా, నారద మహర్షి ఫాల్గుణ పూర్ణిమ రోజున హోలికను పూజిస్తే సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని చెప్పారు. అయితే, ఈ పూజలను రాత్రి వేళ చేయాలని సూచించారు. అప్పటి నుంచి హోలీ పండుగను రాత్రి వేళ జరుపుకోవడం ప్రారంభమైంది.
హిరణ్యకశిపుడు – ప్రహ్లాదుడు కథ
మరో పురాణ కథనం ప్రకారం, హిరణ్యకశిపు అనే రాక్షస రాజు చాలా సంవత్సరాలపాటు తపస్సు చేసి వరం పొందాడు. ఆ తర్వాత తానే దేవుడినని ప్రకటించి, ప్రజలంతా తనను మాత్రమే పూజించాలన్న ఆదేశం జారీ చేశాడు. అయితే, అతని కుమారుడు ప్రహ్లాదుడు శ్రీహరిని విశ్వసించేవాడు. తన తండ్రి చెప్పిన ఆదేశాలను పట్టించుకోకుండా విష్ణువును పూజించేవాడు.
దీనికి కోపించిన హిరణ్యకశిపుడు తన కుమారుడిని అణచివేయాలని ప్రయత్నించాడు. చివరికి, తన సోదరి హోలికను పిలిపించి, ప్రహ్లాదుడిని అగ్నిలో వేసి చంపాలని ఆదేశించాడు. హోలిక అగ్నిని తట్టుకునే వరాన్ని పొందినదనే నమ్మకంతో ప్రహ్లాదుడిని ఒడిలో పెట్టుకుని మంటల్లోకి దూకింది. అయితే, విష్ణునామ స్మరణలో ఉన్న ప్రహ్లాదుడికి ఎటువంటి హాని కలుగలేదు, కానీ హోలిక మంటల్లో కాలిపోయింది. చెడిపై మంచి సాధించిన ఈ ఘట్టాన్ని హోలీ పండుగ రూపంలో జరుపుకుంటారు.
వసంత మహోత్సవం
హోలీ పండుగ చలికాలానికి వీడ్కోలు పలికి, వసంత రుతువు ఆరంభాన్ని తెలియజేస్తుంది. ఈ సమయంలో పొలాలు కొత్త పంటలతో కళకళలాడుతాయి. రైతులకు ఈ పండుగ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అందుకే దీనిని ‘వసంత మహోత్సవం’ లేదా ‘కామ మహోత్సవం’ అని కూడా అంటారు.
‘డోలిక’ అంటే ఊయల అని అర్థం. పురాణాల ప్రకారం, ఫాల్గుణ పౌర్ణమి రోజున శ్రీకృష్ణుడిని ఊయలలో ఊపేవారు. అందుకే పశ్చిమ బెంగాల్‌లో హోలీ రోజున శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఊయలలో ఉంచి ‘డోలికోత్సవం’ నిర్వహిస్తారు.
పూల హోలీ
హోలీ పండుగలో రంగులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సహజమైన పువ్వులతో తయారైన రంగులను ఉపయోగిస్తారు. బర్సానా గ్రామంలో హోలీ వేడుకల్లో మొదట పూల హోలీ నిర్వహించబడుతుంది.
హోలీ పండుగ వెనుక హిరణ్యకశిపుడి కథతో ముడిపడిన ‘హోలికా దహనం’ ప్రధానంగా నిలుస్తుంది. చెడు అంతం కావడం, మంచిని ప్రోత్సహించడమే హోలీ ఉత్సవ సందేశం. హోలీ పండుగను రంగుల, ప్రేమ, స్నేహ బంధాల ప్రదర్శనగా విశేషంగా జరుపుకుంటారు.